India vs England 2nd Test india won the toss elects to bat first: విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న రజిత్ పాటీదార్(Rajat Patidar) కి టీం లో స్థానం దక్కింది.. సర్ఫరాజ్ ఖాన్ కి మరోసారి నిరాశే ఎదురయ్యింది. గాయపడిన రవీంద్ర జడేజా స్థానంలో కులదీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. 


5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌ (India), ఇంగ్లాండ్‌ (England)మధ్య రెండో టెస్టు  విశాఖపట్నం వేదికగా ప్రారంభమైంది. తొలిటెస్టులో ఓటమి చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా పుంజుకుని విజయాల బాటపట్టాలని కోరుకుంటోంది. గాయాల కారణంగా KL రాహుల్‌(KL Rahul), రవీంద్ర జడేజా(ravindra jadeja) భారత జట్టుకు దూరమయ్యారు. రవీంద్ర జడేజా స్థానంలో కులదీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది.  KL రాహుల్‌ స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న రజిత్‌ పటీదార్‌  చోటు సంపాదించుకున్నాడు. 


టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మొదటి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల అధిక్యం సాధించి కూడా టీమిండియా ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. విదేశాల్లో కలుపుకున్నా ఇది మూడోసారి మాత్రమే. 2015లో గాలె టెస్టులో శ్రీలంకపై మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 192 పరుగుల అధిక్యం సాధించింది. అయినా ఆ మ్యాచ్‌లో భారత జట్టు 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌‌తో జరిగిన టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 132 పరుగుల అధిక్యం సాధించింది. అయినా ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని విజయంపై టీం ఇండియా కన్నేసింది. 


500 వికెట్ల క్లబ్‌లో చేరుతాడా..?


ఈ మ్యాచులో అశ్విన్ మ‌రో నాలుగు విక‌ట్లు తీస్తే.. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 96 టెస్టుల్లో 496 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు. రెండో టెస్టు మ్యాచులో రెండు వికెట్లు తీసినా అశ్విన్‌ మరో రికార్డు సృష్టిస్తాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అశ్విన్‌ కొత్త చరిత్ర లిఖిస్తాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ ఘ‌న‌త చంద్రశేఖ‌ర్ పేరిట ఉంది. 


రూట్‌ సాధిస్తాడా..?
హైదరాబాద్‌(Hyderabad) వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్(Joe Root) అరుదైన రికార్డును సృష్టించాడు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాటర్‌గా రూట్‌ నిలిచాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్  2, 555 పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉండగా... సరిగ్గా 2,555 పరుగులు చేసి జో రూట్‌ కూడా అదే స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్‌ ఇంకొక్క పరుగు చేస్తే భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన విదేశీ క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. రూట్‌ను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. రూట్ మరో 138 ప‌రుగులు చేస్తే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 19 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ఇంగ్లాండ్ ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఓవ‌రాల్‌గా 14వ బ్యాట‌ర్‌గా నిలనున్నాడు. రూట్ ఇప్పటి వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 339 మ్యాచులు ఆడాడు. 48.24 స‌గ‌టుతో 66.41 స్ట్రైక్‌రేటుతో 18,862 ప‌రుగులు చేశాడు. ఇందులో 46 శ‌త‌కాత‌లు, 104 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.