టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) గిల్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. వైజాగ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌కుకామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి.. గిల్ వైఫల్యంపై స్పందించాడు. యువకులతో టీమిండియా కదం తొక్కుతోందని. యువ ఆటగాళ్లు సత్తా నిరూపించుకోవాలని. పుజార ఎదురుచూస్తున్నాడనే విషయాన్ని మరచిపోవద్దని సూచించాడు. రంజీ ట్రోఫీలో అతడు పరుగుల వరద పారిస్తున్నాడని... బరిలోకి దిగడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని గిల్, అయ్యర్‌ను హెచ్చరించాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. జార్ఖండ్‌పై అజేయంగా 243 పరుగులు చేశాడు. సర్వీసెస్ టీమ్‌పై 91 పరుగులు చేశాడు. గిల్, అయ్యర్ ఇద్దరూ స్పిన్‌ను ఎదుర్కోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో అవకాశం వచ్చి... ఇద్దరూ ఇలానే నిరాశపరిస్తే... ఆ స్థానాలను చేజేతులా కొత్త వాళ్లకు అప్పగించినట్లు అవుతుంది.
తొలి రోజు భారత్ దే....
వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ... అజేయ శతకంతో టీమిండియాను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. యశస్వి జైస్వాల్ భారీ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్... 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జైస్వాల్‌కు తోడుగా అశ్విన్ అయిదు పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.