8 cricketers make their debut across international formats: అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో  శుక్రవారం అరుదైన ఘటన జరిగింది. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలనే కలను ఒక్కరోజే ఎనిమిది మంది  ఆటగాళ్లు నెరవేర్చుకున్నారు. ఒక్కరోజే అత్యధిక ప్లేయర్లు అరంగేట్రం చేశారు. భారత్- ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా భారత యువ ఆటగాళ్లు రజత్‌ పటీదార్‌ టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మాజీ పేసర్‌ జహీర్ ఖాన్ చేతులమీదుగా టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఇక ఆఫ్గానిస్థాన్‌ జట్టులోనే  నలుగురు ప్లేయర్లు ఇంటర్నేషనల్‌ డెబ్యూ చేశారు. ఇంతకుముందు ఇలా భారీ సంఖ్యలో ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టలేదు. రజత్‌ పటీదార్‌ (భారత్), షోయబ్‌ బషీర్‌ (ఇంగ్లాండ్) జేవియర్‌ బార్ట్‌లెట్‌ (ఆస్ట్రేలియా), లాన్స్‌ మోరిస్ (ఆస్ట్రేలియా), నూర్‌ అలీ జద్రాన్‌(అఫ్గానిస్థాన్), నవీద్‌ జద్రాన్‌ (అఫ్గానిస్థాన్), జియా ఉర్‌ రెహ్మాన్‌ అక్బర్‌ (అఫ్గానిస్థాన్), మొహమ్మద్‌ సలీం (అఫ్గానిస్థాన్) అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.
 

తొలి రోజు భారత్‌ దే....

వైజాగ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌ అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ... అజేయ శతకంతో టీమిండియాను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. యశస్వి జైస్వాల్‌ భారీ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటం చేశాడు. 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్... 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జైస్వాల్‌కు తోడుగా అశ్విన్‌ అయిదు పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్‌ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ మార్క్‌ అందుకున్న జైస్వాల్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

 

గిల్‌, అయ్యర్‌ వైఫల్యం

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌, 

శ్రేయస్స్ అయ్యర్‌ వరుసగా విఫలమతున్నారు. సీనియర్‌, యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న వేళ గిల్‌, అయ్యర్‌ వరుసగా వైఫల్యం అవుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పెద్దగా రాణించని గిల్‌... రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ త్వరగానే అవుటై నిరాశను మిగిల్చాడు. గత ఐదు టెస్టుల్లో గిల్‌ అత్యధిక స్కోరు 36 పరుగులే. వైజాగ్‌ టెస్టులో 34 పరుగులు చేసి జోరు మీద కనిపించి హాఫ్‌ సెంచరీ చేస్తాడన్న అభిమానుల ఆశ నెరవేరలేదు. మరోవైపు శ్రేయస్స్ అయ్యర్‌ కూడా సుదీర్ఘ ఫార్మట్‌లో విఫలమవుతున్నాడు. ఇంగ్లాండ్‌తోతొలి టెస్టులో 35, 13 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులు. గత 11 ఇన్నింగ్స్‌ల్లో అతడి నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. ధాటిగా ఆరంభిస్తున్నా... వాటిని అర్ధ శతకాలుగా, సెంచరీలుగా అయ్యర్‌ మలచలేకపోతున్నాడు. టెస్టుల్లో అతి ముఖ్యమైన ఓపిక అతనిలో కనిపించడం లేదు. అందుకే వికెట్ పారేసుకుంటున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు.