India beat Nepal by 132 runs, enter semifinals: అండర్‌- 19 ప్రపంచకప్‌(U19 World Cup 2024)లో వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత్‌ (Team India)సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్లూమ్‌ఫౌంటీన్‌ వేదికగా జరిగిన రెండో సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో నేపాల్‌( Nepal)పై 132 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన యువ భారత్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్‌ దశలో మూడు, సూపర్‌ సిక్స్‌లో ఒక మ్యాచ్‌ నెగ్గిన భారత్‌.. తాజా విజయంతో సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. భారత్‌ నిర్దేశించిన 298 పరుగుల ఛేదనలో నేపాల్‌.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత యువ స్పిన్నర్‌ సౌమీ పాండే 4 వికెట్లతో చెలరేగాడు. భారత ఇన్నింగ్స్‌లో  కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (100; 107 బంతుల్లో 9×4), సచిన్‌ దాస్‌ (116; 101 బంతుల్లో 11×4,3×6) శతకాలతో మెరిశారు.


శతక మోత...
 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. 21 పరుగులు చేసిన ఆదర్శ్‌ సింగ్‌ 26 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత కులకర్ణి, మోలియా భారత స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. వీరిద్దరు జట్టు స్కోరును 62 పరుగులకు చేర్చారు. అనంతరం 18 పరుగులు చేసిన కులకర్ణి, 21 పరుగులు చేసిన ఆదర్శ్‌సింగ్‌ పెవిలియన్‌ చేరడంతో యువ భారత జట్టు 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ భారత కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (100; 107 బంతుల్లో 9×4), సచిన్‌ దాస్‌ (116; 101 బంతుల్లో 11×4,3×6) శతకాలతో టీమిండియాకు మెరుగైన స్కోరు అందించారు. నేపాల్ బౌలర్లలో గుల్సన్ ఝా 3, ఆకాశ్‌ చంద్ ఒక వికెట్‌ తీశారు.


అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేక పోయింది. జట్టు స్కోరు 48 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. రాజ్‌ లింబానీ వేసిన 13.2వ బంతికి ఓపెనర్‌ దీపక్‌ బొహరా (22) కాట్‌ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అర్జున్‌ కుమల్‌ (64 బంతుల్లో 26, 3 ఫోర్లు) 13 ఓవర్ల పాటు ఆడి 48 పరుగులు జతచేశారు.వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఉత్తమ్‌ తపమగర్‌ (8)ను సౌమీ పాండే ఔట్‌ చేశాడు. కెప్టెన్‌ దెవ్‌ ఖనల్‌ (53 బంతుల్లో 33, 2 ఫోర్లు) కొంతసేపు క్రీజులో నిలబడ్డాడు. బిషల్‌ బిక్రమ్‌ (1), దీపక్‌ దుమ్రె (0) , గుల్షన్‌ ఝా (1), దీపేశ్‌ కండెల్‌ (5)లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆఖర్లో ఆకాశ్‌ చంద్‌ (35 బంతుల్లో 19 నాటౌట్‌), దుర్గేశ్‌ గుప్తా ( 43 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్స్‌) లు నేపాల్‌ ఆలౌట్‌ కాకుండా కాపాడారు. భారత్‌ బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లు పడగొట్టగా.. కులకర్ణి 2, రాజ్‌ లింబాని, ఆరాధ్య సుక్లా, మురుగన్‌ అభిషేక్‌ తలో వికెట్‌ తీశారు. అద్భుత శతకంతో చెలరేగిన సచిన్‌ దాస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.