India vs Bangladesh 1st Test Day 2: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ పతనం ఆరంభమైంది. టీమిండియా సీమర్లు నిప్పులు చెరుగుతుండడంతో క్రీజులు నిలదొక్కుకునేందుకు బంగ్లాదేశ్‌ బ్యాటర్లు కష్ట పడుతున్నారు. 376 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను భారత్ ముగించింది. ఓవర్ నైట్‌ స్కోరు 86 పరుగుల వద్దే రవీంద్ర జడేజా వెనుదిరగగా.. అశ్విన్‌ 113 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆకాశ్‌ దీప్ 17 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ బుమ్రా, సిరాజ్‌ వెంటవెంటనే అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్‌ 376 పరుగుల వద్ద ముగిసింది. 






భారత సీమర్ల షాక్

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ను భారత పేసర్లు వణికించారు. తొలి ఓవర్‌లోనే భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా బంగ్లాను చావు దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్‌ చివరి బంతికి బంగ్లా బౌలర్‌ను బౌల్డ్ చేసి వికెట్ల పతనం ఆరంభించాడు. ఓ అద్భుత బంతితో బంగ్లా ఓపెనర్ షాద్‌మన్  ఇస్లాంను పెవిలియన్‌కు పంపాడు. ఆరు బంతుల్లో రెండే పరుగులు చేసి ఇస్లాం పెవిలియన్‌కు చేరాడు. అనంతరం... ఆకాశ్‌ దీప్‌.. బంగ్లా బ్యాటర్ల పనిపట్టాడు. అద్భుత బంతులతో బంగ్లా బ్యాటర్లను ఆకాశ్ పరీక్షించాడు. ఓవైపు బుమ్రా.. మరోవైపు ఆకాశ్‌ బంగ్లాను ముప్పుతిప్పలు పెట్టారు. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టాడు. బంగ్లా మరో ఓపెనర్‌ జాకీర్ హసన్‌ను ఆకాశ్‌ దీప్‌ బౌల్డ్‌ చేశాడు. 22 బంతుల్లో ఆడి మూడు పరుగులు చేసిన హసన్‌ను ఆకాశ్ మంచి బంతితో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే మానిముల్ హక్‌ను అవుట్‌ చేశాడు. హక్‌ను కూడా ఆకాశ్‌ దీప్‌ బౌల్డే చేయడం విశేషం.





 

బంగ్లా ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోగా ఆ మూడు వికెట్లు కూడా బౌల్డ్ కావడం విశేషం. ఓవైపు వికెట్లు వడుతున్నా బంగ్లా కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్ శాంటో మాత్రం చాలా జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. శాంటో 15 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తు‌న్నాడు. ప్రస్తుతం బంగ్లా 26 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. భారత బౌలర్లు ఇదే ఊపు కొనసాగిస్తే భారత్‌కు భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 350 పరుగులు వెనకపడి ఉంది.