IND vs AUS Final 2023: అంతర్జాతీయ క్రీకెట్ మండలి (ఐసీసీ) నాలుగేళ్లకోసారి నిర్వహించే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ విజేతలకు ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీ అందించడం పరిపాటే! అయితే ఈ ట్రోఫీని ఆ తర్వాత ఎక్కడ పెడతారో తెలుసా?
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 1975లో ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కాగా.. వరుసగా మూడు సార్లు ఇంగ్లండ్‌లోనే మెగాటోర్నీ జరిగింది. ఆ సమయంలో ట్రోఫీని ‘ప్రూడెన్షియల్ కప్ ట్రోఫీ’ అని పిలిచేవారు. 1975తో పాటు 1979, 1983లో విశ్వ విజేతగా నిలిచిన జట్లకు ఇదే ట్రోఫీని బహుకరించారు. భారత్ తొలిసారి కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచకప్ అందుకున్న సమయంలో మనకు దక్కిన ట్రోఫీ ఇదే. ఆ తర్వాత 1987లో తొలిసారి భారత్ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చింది. పాకిస్థాన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆ టోర్నీకి ‘రిలయన్స్ కప్ ట్రోఫీ’ అని నామకరణం చేశారు. ఆ తర్వాత 1992 వరల్డ్‌కప్‌కు ‘బెన్సన్, హెడ్జెస్ ట్రోఫీ’గా పిలవగా.. 1996లో ‘విల్స్ కప్ ట్రోఫీ’ అని పేరు పెట్టారు. ఇలా ఒక్కో టోర్నీకి పేరు మార్చడం బాలేదని అనుకున్న ఐసీసీ 1999 నుంచి ఇప్పటి వరకు ఒకే ట్రోఫీని అందిస్తూ వస్తోంది.
ప్రస్తుతం మూడు వైపులా వికెట్ల నిర్మాణం వంటి దాని మధ్యలో బంతిపై విశ్వం ఉండేలా తీర్చిదిద్దిన ట్రోఫీని 1999, 2003, 07, 11, 15, 19 విజేతలకు అందించారు. అయితే విశ్వ విజేతగా బహుమతి ప్రదాన సమయంలో మాత్రమే ఓరిజినల్ ట్రోఫీని చేతికి ఇస్తారు. ఆ తర్వాత దాన్ని తిరిగి దుబాయ్‌లో ఉన్న ఐసీసీ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. దీని నమూనా ట్రోఫీ విశ్వ విజేతకు అందిస్తారు. ఒరిజినల్ ట్రోఫీ 60 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని బంగారం, వెండితో తయారు చేస్తారు.
వికెట్ల రూపంలో ఉన్న మూడు పిల్లర్లు.. క్రికెట్‌లో ప్రధాన అంశాలైన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ను రిప్రజెంట్ చేస్తాయి. దీని బరువు దాదాపు 11 కేజీలు కాగా.. ఏ కోణం నుంచి చూసినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత. గత విజేతల పేర్లను నమోదు చేసేందుకు ఈ ట్రోఫీ కింది భాగంలో ప్రత్యేక బేస్ ఏర్పాటు చేశారు. దీనిపై మాజీ చాంపియన్ల పేరును పొందుపరుస్తారు. అయితే ప్రధాన ట్రోఫీని మాత్రం కేవలం టోర్నీ ముగిసిన సమయంలో విజేతగా నిలిచిన జట్టుకు అందించినా.. ఆ తర్వాత మాత్రం దాన్ని తిరిగి తీసుకొని దుబాయ్‌లో ఉంచుతారు. దాని ప్రతి రూపాన్ని మాత్రమే విజేతలకు అందిస్తారు. అచ్చం ప్రధాన ఆలయాల్లో జరిగే ఉత్సవ ఊరేగింపు మాదిరిగానే.. గర్భగుడిలో మూల విరాట్ కొలువై ఉంటే.. ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి మాడ వీధుల్లో తిప్పుతారు. ఇది కూడా అంతే.. అసలు ట్రోఫీ దుబాయ్‌లో ఐసీసీ కార్యాలయంలో ఉంటే.. దాని ప్రతిమను విజేత జట్లు తమ దేశానికి తీసుకెళ్తాయి.