India vs Australia World Cup Final 2023: ఐసీసీ వరల్డ్ కప్ (ICC World Cup) మెగా టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో  వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ (World Cup Final) మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో (Ahmedabad)  జరుగనుంది.  టోర్నీలో ఓటమినే ఎరుగని టీమ్‌ఇండియా, ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా తలపడనున్నాయి.  మాములుగానే భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు ఆ మ్యాచ్‌ కోసం ఆసక్తికా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. మైదానంలో ఆట‌గాళ్ల క‌వ్వింపులు, ఉద్వేగ‌పూరిత క్షణాలు మ్యాచ్‌ను ఆస‌క్తిక‌రంగా మారుస్తాయి. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ కోసం  ఏకంగా  లక్షా ముప్పై వేల మంది అభిమానులు, ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తమిళనాడు, అసోం ముఖ్యమంత్రులతోపాటు అతిరతమహారథులు ఈ మెగా ఫైనల్‌కు హాజరుకానున్నారు.  ఈ నేపథ్యంలో గుజరాత్‌ పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 6 వేలకుపైగా మంది సిబ్బందిని మోహరించింది. ఒక్క  స్టేడియం దగ్గరే కాకుండా  ఆటగాళ్లు బసచేస్తున్న హోటళ్లు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నామని అహ్మదాబాద్‌ కమిషనర్‌ జీఎస్‌ మాలిక్‌ చెప్పారు. ఇందుకోసం గుజరాత్‌ పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (RAF), హోమ్‌గార్డులు, ఇతర సిబ్బందిని  వినియోగిస్తున్నామని తెలిపారు. 



మొత్తం 6 వేల మంది సిబ్బందిలో స్టేడియం లో 3 వేల మంది,  మిగిలినవారిని స్టేడియ బయట, నగరంలోని పలు ప్రాంతాల్లో  మోహరించామన్నారు. వీరితో పాటూ  ఐపీఎస్‌ ర్యాంక్‌ కలిగిన 23 మంది ఐజీ, డీఐజీ, డిప్యూటీ పోలీస్ కమిషనర్లు, 39 మంది మంది కమిషనర్లు, 92 మంది ఇన్‌స్పెక్టర్లు భద్రతను పర్యవేక్షిస్తారని వెల్లడించారు. అదేవిధంగా చేతక్‌ కమాండోలతోపాటు బాంబ్‌ స్క్వాడ్‌కు చెందిన 10 టీమ్‌లు స్టేడియం పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.


ఈ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన వెంటనే ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేలా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ పది నిమిషాల పాటు అహ్మదాబాద్‌ స్టేడియంలో ఎయిర్ షో నిర్వహించనున్నట్లు గుజరాత్ డిఫెన్స్ పీఆర్‌వో గతంలో వెల్లడించారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌లో మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉంటాయి. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరడం పట్ల ఫ్యాన్స్ ఫుల్ కుషీలో ఉన్నారు. ప్రధాని మోదీ ఫైనల్ మ్యాచుకు వస్తారని విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తొలి సెమీఫైనల్‍లో న్యూజిలాండ్‍పై భారత్ 70 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత భారత జట్టును అభినందిస్తూ ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు. మెన్ ఇన్ బ్లూను కొనియాడుతూ ట్వీట్ చేశారు. వన్డేల్లో 50 శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీని సైతం.. ప్రధాని మోదీ అభినందించారు.


అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో..రెండుసార్లు టోర్నీ విజేత భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.మధ్యాహ్నం  రెండు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2003 ప్రపంచకప్‌ ఫైనల్ పరాభవానికి  బదులు తీర్చుకోవాలనుకుంటున్న  టీం ఇండియా  కసిగా కనిపిస్తోంది. ఈ టోర్నీ మొత్తం ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ప్రణాళికబద్దంగా ఆడిన భారత్ ఫైనల్‌లోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ఫైనల్  మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్ మరోసారి శుభారంభం ఇవ్వాలని కోహ్లీ అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.