Cricket Australia Announces Venues For IND vs AUS Tests: నవంబర్‌లో టీమిండియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా వేదికలను ఖరారు చేసింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో మొదటి టెస్టు జరగనుంది. పెర్త్‌లో ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు పెద్దగా ప్రేక్షకులు రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులను రప్పించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళికలు రచిస్తోంది. రెండో మ్యాచ్ అడిలైడ్ ఓవల్ మైదానంలో జరగనుండగా, మూడో టెస్టు మ్యాచ్‌కు బ్రిస్బేన్‌లోని ది గబ్బా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. బాక్సింగ్ డే టెస్ట్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకురావాలని క్రికెట్ ఆస్ట్రేలియా గట్టిగా ప్రయత్నిస్తోంది.
టీ 20 ప్రపంచకప్ వేట కూడా..
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. ఈ టీ 20 ప్రపంచకప్ ట్రోఫీ యాత్ర న్యూయార్క్‌లో మొదలైంది.
యాత్ర షురూ....
అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ట్రోఫీ యాత్ర ప్రారంభమైంది. విధ్వంసకర బ్యాటర్, యూనివర్సల్ బాస్, రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన క్రిస్ గేల్, అమెరికా బౌలర్ అలీ ఖాన్ ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి ట్రోఫీ యాత్రను ఆరంభించారు. ట్రోఫీ యాత్ర 15 దేశాల్లో సాగుతుంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ జూన్ 1 నుంచి 29 వరకు జరగనుంది. టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డేను కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండు సెమీస్ మ్యాచ్‌లూ జూన్ 27నే జరగనుండగా.. ఫైనల్‌ను జూన్ 29న నిర్వహిస్తారు. ఈ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్ డేలను నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన లోగోలను ఐసీసీ విడుదల చేసింది.
Also Read: ఐపీఎల్ ఫీవర్, టాప్ టెన్ శతకాలు ఇవే