Ind vs Aus, 1st ODI: 


ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదు. కుటుంబ బాధ్యతలతో అతడు పోటీకి గైర్హాజరు అవుతున్నాడు. దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఈ మ్యాచుకు సారథ్యం వహిస్తాడని తెలిసింది.


ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ జరగబోతోంది. ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచే టీమ్‌ఇండియా ఈ మెగా టోర్నీకి సన్నాహాలు మొదలు పెట్టింది. సమయం, మ్యాచులు తక్కువగా ఉండటంతో ప్రతి మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంటోంది. గాయాలతో శ్రేయస్‌ అయ్యర్‌, జస్ప్రీత్‌ బుమ్రా దూరమవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది.


రోహిత్‌ శర్మ అందుబాటులో లేకపోవడంతో తొలి మ్యాచులో యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. రెడ్‌ హాట్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌కు అతడు అండగా ఉంటాడు. శ్రేయస్‌ అయ్యర్‌ లేకపోవడంతో సూర్యకుమార్‌ యాదవ్‌కు జట్టులో చోటు ఖాయమైనట్టే! ఇక కేఎల్‌ రాహుల్‌ ఎప్పట్లాగే మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రానున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ ఎంపిక మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.


గతేడాది ఐపీఎల్‌ నుంచి హార్దిక్‌ పాండ్య తలరాతే మారిపోయింది. గుజరాత్‌ టైటాన్స్‌కు ట్రోఫీ అందించాడు. ఆపై టీమ్‌ఇండియా టీ20 జట్టుకు నాయకుడిగా ఎంపికయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడంతో ఇప్పుడు వన్డే జట్టుకూ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.


భారత్‌, ఆస్ట్రేలియా తొలి వన్డే మార్చి 17, శుక్రవారం రోజు వాంఖడే వేదికగా జరుగుతోంది. రెండో వన్డేకు విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. ఆదివారం, మార్చి 19న మ్యాచ్‌ ఉంటుంది. మూడో పోరు చెన్నైలో జరుగుతుంది. మార్చి 22న ఉంటుంది.


బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని టీమ్‌ఇండియా 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు రెండు రోజులు విరామం తీసుకున్నారు. బుధవారం నుంచే ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు.


ఆసీస్‌ వన్డే సిరీసుకు టీమ్‌ఇండియా


రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌, మహ్మద్‌ షమి, హమ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌