ఆస్ట్రేలియాతో జరుగుతున్న అయిదు టీ 20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను సొంతం చేసుకున్న టీమిండియా... సిరీస్‌పై కన్నేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే గెలవాలని పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక గువాహటిలో జరిగే నేటి మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తిలక్ వర్మకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అనుకున్నంత మేర రాణించలేకపోయిన తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు.
ప్రపంచకప్ ఫైనల్ తర్వాత వారం రోజులపాటు విశ్రాంతి తీసుకున్న శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ తర్వాత తిరిగి జట్టులోకి రానున్నాడు. రాయ్‌పూర్, బెంగళూరుల్లో జరిగే చివరి రెండు మ్యాచుల్లో అయ్యర్ బరిలోకి దిగుతాడు. అయ్యర్ ప్లేయింగ్ లెవన్‌లోకి వస్తే తిలక్‌వర్మపై వేటు పడే అవకాశం ఉంది. తిలక్‌వర్మ తొలి రెండు టీ20ల్లో కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్‌ల్లో 10 బంతుల్లో 12 పరుగులు చేసిన తిలక్... రెండో మ్యాచ్‌లో చివరి రెండు బంతులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. తన సత్తా నిరూపించుకోవడానికి ఈ సిరీస్‌లో తిలక్‌కు ఇదే చివరి అవకాశం కావొచ్చు. తిలక్ తుది జట్టులో చోటు కోల్పోయేందుకు ఆస్కారముంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా తిలక్‌కు మరిన్ని బంతులు ఆడే అవకాశమొస్తుందో లేదో చూడాలి. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తలా హాఫ్ సెంచరీ చేయడంతో భారత టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ఇషాన్ కిషన్ రెండు అర్ధ సెంచరీలు చేశాడు. రింకూ సింగ్ మంచి ఫినిషర్‌గా మారాడు.
తుది జట్టులో భారత్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఇక బంతితో రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లు పుంజుకున్నారు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే బౌండరీల సంఖ్యను తగ్గించగలిగారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చక్కగా బౌలింగ్ చేశారు. అయితే రెండు మ్యాచ్‌ల్లో కలిపి 87 పరుగులిచ్చి ఒకే వికెట్ పడగొట్టిన ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మెరుగుపడాల్సివుంది. ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం అవసరం.
ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో చెలరేగి ఆడిన స్టాయినిస్, టిమ్ డేవిడ్ ఫామ్‌లో ఉండడం ఆ జట్టును కొంచెం ప్రశాంతంగా ఉంచేలా చేస్తోంది. మ్యాక్స్‌వెల్ మరోసారి విధ్వంసకరంగా ఆడాలని ఆసిస్ కోరుకుంటోంది. ఓపెనర్లు స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్‌ల నుంచి జట్టు శుభారంభం ఆశిస్తోంది. ఆ జట్టు బౌలర్ల ప్రదర్శన మెరుగుపడాల్సి ఉంది. రెండో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన పేసర్ అబాట్ స్థానంలో బెరెన్‌డార్ఫ్ ఆసీస్ తుది జట్టులోకి రావచ్చు. ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా వంటి వారి సీనియర్ ఆటగాళ్లు తొమ్మిది వారాల పాటు భారత్‌లో ఉన్నారు. వారిలో అలసట కనిపిస్తోంది. ఆ ప్రభావం బ్యాటింగ్‌పై కనిపిస్తోందని క్రీజా నిపుణులు చెబుతున్నారు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా.