IND vs AUS, 2nd ODI: 


ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఇరగదీస్తోంది. ఇండోర్‌ స్టేడియంలో భారత బ్యాటర్లు దంచికొడుతున్నారు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోస్తున్నారు. పోటీపడి మరీ కంగారూలకు ఆందోళన కలిగిస్తున్నారు. జట్టును భారీ స్కోరు వైపు తీసుకెళ్తున్నారు. యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ శతకం చేసి ఔటయ్యాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సొగసరి సెంచరీతో అజేయంగా నిలిచాడు. అతడికి కేఎల్‌ రాహుల్‌ (9) తోడుగా ఉన్నాడు. 33 ఓవర్లకు టీమ్‌ఇండియా 230/2తో నిలిచింది.


హోల్కర్‌ చిన్న మైదానం! పైగా భారీ స్కోర్లకు పెట్టింది పేరు! బ్యాటర్లకు స్వర్గధామం. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా దూకుడుగా ఆడాలనే నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టే ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. జట్టు స్కోరు 16 వద్ద ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (8)ని హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. అదే వారికి శాపమైంది. వన్‌డౌన్లో దిగిన శ్రేయస్‌ రావడంతోనే బౌండరీ కొట్టి తన ఉద్దేశమేంటో చెప్పాడు. సొగసైన బౌండరీలు బాదేశాడు. శ్రేయస్‌తో కలిసి ఆసీస్‌ బౌలర్లను చితకబాదాడు. ఫీల్డర్లను మైదానం మొత్తం ఉరికించాడు. రెండో వికెట్‌కు 164 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారంటేనే వారి దూకుడు అర్థం చేసుకోవచ్చు.


శ్రేయస్, గిల్‌ ధాటికి 12.5 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు 100కు చేరుకుంది. ఇక గిల్‌ 37, అయ్యర్‌ 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకున్నారు. ఆ తర్వాత దాడి మరింత పెంచారు. 19.3 ఓవర్లకు 150, 28.3 ఓవర్లకు 200 పరుగుల మైలురాయి దాటించారు. ఇదే ఊపులో శ్రేయస్‌ 86 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే భారీ షాట్‌ ఆడే క్రమంలో జట్టు స్కోరు 216 వద్ద అబాట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంతో కేఎల్‌ రాహుల్‌ అండతో శుభ్‌మన్‌ సెంచరీ కొట్టాడు. ఇందుకోసం 92 బంతులే తీసుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌, అబాట్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.


పిచ్‌ రిపోర్ట్‌: ఇండోర్‌ స్టేడియం చిన్నది. బౌండరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. స్క్వేర్‌ వెనక బ్యాటింగ్‌ చేసేవాళ్లకు బౌండరీ 55 మీటర్ల దూరంలో ఉంటుంది. పిచ్‌ మందకొడిగా ఉంది. కానీ గట్టిగా ఉంది. ఎక్కువ స్కోర్‌ నమోదవుతుంది. పేస్ బౌలర్లకు బౌలింగ్‌ సవాలే. ఎక్కువ బంతులు బౌండరీకే వెళ్తాయి. ఎక్కువ టార్గెట్‌ ఇస్తే స్పిన్నర్లు కీలకం అవుతారు.


భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ షమి


ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మాథ్యూ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, కామెరాన్‌ గ్రీన్‌, జోస్‌ ఇంగ్లిష్, అలెక్స్‌ కేరీ, సేన్‌ అబాట్‌, ఆడమ్‌ జంపా, జోష్‌ హేజిల్‌వుడ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌


ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాలతో అతడు నేటి మ్యాచ్‌ ఆడటం లేదని తెలిసింది. మొహాలి నుంచి అతడు ఇండోర్‌కు వెళ్లలేదు. కుటుంబ సభ్యులను కలిసేందుకు ముంబయికి వెళ్లినట్టు బీసీసీఐ తెలిపింది. మ్యాచ్‌ జరగడానికి గంట ముందు ట్వీట్‌ చేసింది. అతడి స్థానంలో యువ పేసర్ ముకేశ్‌ కుమార్‌ ఆడుతున్నట్టు ప్రకటించింది. బుమ్రా తిరిగి మూడో వన్డేకు జట్టుతో కలుస్తాడు.