IND vs AUS 1st Test Day 2:  భారత్- ఆస్ట్రేలియా రెండో రోజు తొలి సెషన్ లో టీమిండియా ఆధిపత్యం సాగింది. 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఈ సెషన్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది. ఒక వికెట్ నష్టానికి 77 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (142 బంతుల్లో 85 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 12 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 


రెండో రోజు ప్రారంభంలో రోహిత్ శర్మ, అశ్విన్ లు నిలకడగా ఇన్నింగ్స్ ను నడిపించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. కొన్ని బంతులు పరీక్షించినప్పటికీ పట్టుదలగా క్రీజులో నిలిచారు. ఆస్ట్రేలియా సహనాన్ని పరీక్షిస్తూ.. అడపాదడపా బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఈ జోడీ వికెట్ ఇవ్వకుండా దాదాపు గంటన్నరపాటు బ్యాటింగ్ చేసింది. రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు.  అయితే తొలి రోజు రాహుల్ వికెట్ తీసిన మర్ఫీ అశ్విన్ (62 బంతుల్లో 23) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఆ వెంటనే పుజారా (14 బంతుల్లో 7)ను కూడా క్యాచ్ ఔట్ ద్వారా మర్ఫీనే పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయింది.  అయితే మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కోహ్లీ సహకరిస్తున్నాడు.


రెండో రోజు తొలి సెషన్ లో 2 వికెట్లు కోల్పోయిన భారత్ 74 పరుగులు చేసింది. ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది. ఇప్పటికే బంతి తిరగడం ప్రారంభించింది. మరి ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కొంటూ టీమిండియా రెండో రోజు ఎంత ఆధిక్యం సాధిస్తుంది అనేదానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 






మొదటిరోజు ఆట


తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బంతితో అద్భుతంగా రాణించిన భారత్ ఆసీస్ ను 177 పరుగులకే కట్టడిచేసింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగి ఆస్ట్రేలియా పతనాన్ని సాధించాడు. అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. షమీ, సిరాజ్ లు తలా ఒక వికెట్ సాధించారు. మార్నస్‌ లబుషేన్‌ (49; 12౩ బంతుల్లో 8x4), స్టీవ్‌స్మిత్‌ (37; 107 బంతుల్లో 7x4) టాప్‌ స్కోరర్లు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి రోజు వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.