IND vs AUS, 1st ODI:


టీమ్‌ఇండియాతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తోంది. మంచి టార్గెట్‌ సెట్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బంతికో పరుగు చొప్పున చేస్తోంది. కామెరాన్‌ గ్రీన్‌ (6; 9 బంతుల్లో), జోస్‌ ఇంగ్లిస్‌ (12; 14 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.




సిరాజ్‌.. సూపర్‌!


మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు మంచి స్టార్ట్‌ లభించలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (5) మహ్మద్‌ సిరాజ్‌ బౌల్డ్‌ చేశాడు. మంచి లెంగ్తులో పడ్డ బంతిని మిడిల్‌ చేసేందుకు హెడ్‌ ప్రయత్నించాడు. బ్యాటు లోపలి అంచుకు తగిలిన బంతి నేరుగా వికెట్లను లేపేసింది. మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (81; 65 బంతుల్లో 10x4, 5x6) మాత్రం సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడేశాడు. కాస్త నిలదొక్కుకున్నాక చక్కని షాట్లు బాదేశాడు. బౌండరీలు, సిక్సర్లతో మోత మోగించాడు. అతడికి స్టీవ్‌ స్మిత్‌ (22; 30 బంతుల్లో 4x4) అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.




దంచికొట్టిన మార్ష్‌!


ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్మిత్‌ను ఔట్‌ చేయడం ద్వారా జడ్డూ విడదీశాడు. ఆ తర్వాత లబుషేన్‌ (15) అండతో మార్ష్‌ రెచ్చిపోయాడు. 51 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఆపై ఎడాపెడా బాదేసి స్కోరు వేగం పెంచాడు. దాంతో 16.4 ఓవర్లకు ఆసీస్‌ 100 పరుగుల మైలురాయి అధిగమించింది. జట్టు స్కోరు 139 వద్ద లబుషేన్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ బుట్టలో పడేశాడు. చక్కని లెంగ్తులో వచ్చిన బంతిని డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నించిన లబుషేన్‌ కుదరకపోవడంతో గాల్లోకి ఆడేశాడు. దానికి జడ్డూ డైవ్‌ చేసి ఒడిసిపట్టాడు. మరో 10 పరుగులకే మార్ష్‌ను జడేజా ఔట్‌ చేశాడు. సిక్సర్‌ బాదే క్రమంలో బ్యాటు అంచుకు తగిలిన బంతి థర్డ్‌మ్యాన్‌ వైపు లేచింది. దానిని సిరాజ్‌ పట్టేశాడు.