Asia Cup 2025 Ind vs Pak latest News : హ్యాండ్ షేక్, మ్యాచ్ రిఫరీ వివాదం తర్వాత చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోసారి డీకొననున్నాయి. ఆసియాకప్ సూపర్-4 రెండో మ్యాచ్ లో దాయాదులు దుబాయ్ వేదికగా ఆదివారం తలపడనున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ కాస్త ఎమోషనల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిస్సందేహంగా ఈ మ్యాచ్ లో భారతే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కీలక మైన మ్యాచ్ కాబట్టి, పూర్తి స్థాయి టీమ్ తో జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి పునరాగమనం చేసే అవకాశముంది. ఈ మ్యాచ్ లో నెగ్గి, సూపర్-4లో శుభారంభం చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
పటిష్టంగా టీమిండియా..అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో పాక్ కంటే టీమిండియా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. ఓపెనర్లుగా శుభమాన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగుతుండగా, మిడిలార్డర్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడతారు. ఒమన్ తో మ్యాచ్ లో తలకు గాయం కావడంతో అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడేది లేనిది డౌట్ గా ఉంది. తను బరిలోకి దిగకపోతే అర్షదీప్ సింగ్ లేదా హర్ఙిత్ రాణా ఆడే అవకాశముంది. పేసర్ గా జస్ ప్రీత్ బుమ్రా ఆడుతుండగా, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగుతారు. దీంతో భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. ఇక లీగ్ దశలో మూడింటికి మూడు మ్యాచ్ లు గెలిచి, సమరోత్సాహంతో ఉంది. అలాగే పాక్ పై కూడా ఈజీ విక్టరీని సొంతం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్ లో మరింత జోష్ గా బరిలోకి దిగబోతోందని తెలుస్తోంది. ఇక భారత్ తర్వాతి మ్యాచ్ ల్లో ఈనెల 24న బంగ్లాదేశ్, 26న శ్రీలంకతో తలపడనుంది. 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
అయోమయంలో.. ఈ టోర్నీలో పాక్ కాస్త అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. తరచూ ప్లేయింగ్ లెవన్ ను మారుస్తూ ఉంది. ఇక అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ చెప్పుకోదగిన విధంగా రాణించడం లేదు. గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యంతోనే జట్టు ఓడిపోయింది. ఈ సారి మాత్రం అలాంటి పొరపాటు రిపీట్ కావద్దని భావిస్తోంది. మ్యాచ్ కోసం సరైన జట్టును ఎంపిక చేయడం సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏ కాంబినేషన్ తో ఆడుతుందో చూడాలి. తొలి మ్యాచ్ లో ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకొంటోంది. ఇక ఈ మైదానంలో ఛేజ్ చేసే జట్లకు అనుకూలంగా మారుతోంది. దీంతో టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది. ఈ మ్యాచ్ సోనీ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.