Sarfaraz Khan: 


సెలక్షన్‌ కమిటీ - సర్ఫరాజ్‌ ఖాన్‌ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు! రోజుకొకరు ఈ వ్యవహారంపై మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా డబ్ల్యూవీ రామన్‌ స్పందించారు. సెలక్టర్లు సర్ఫరాజ్‌లోని లోపాలను పట్టుకోలేకపోయారని ఆయన అంటున్నారు. అయితే వారేమీ దేవుళ్లు కారని.. మైదానంలో, బయటా ఆటగాళ్ల వైఖరి, మనస్తత్వం, ప్రవర్తనను గమనిస్తుంటారని వెల్లడించాడు.


వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీసుకు శివసుందర్‌ దాస్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌ను (Sarfaraz Khan) ఎంపిక చేయలేదు. ఈ నిర్ణయం విమర్శలకు దారితీసింది. అయితే అతడిని మళ్లీ మళ్లీ పట్టించుకోకపోవడానికి క్రికెట్‌ ఏతర కారణాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అతడి ఫిట్‌నెస్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు లేదని బరువు తగ్గించుకొని మరింత ఫిట్‌గా మారాలని పేర్కొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోవచ్చని వినికిడి.


'సెలక్షన్‌ కమిటీ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై చాలా అభిప్రాయాలు వచ్చాయి. ఫాస్ట్‌ బౌలింగ్‌ను మెరుగ్గా ఎదుర్కొనే సామర్థ్యం, ఫిట్‌నెస్‌, ఫీల్డింగ్‌ స్థాయిల్ని పెంచుకోవాలని కొందరు అన్నారు. అసలు వాళ్ల ఉద్దేశమేంటో నాకు చెప్పే ప్రయత్నం చేస్తారా? సెలక్టర్లు దేవుళ్లని మీరు భావిస్తున్నారా? వాళ్లు దేవుళ్లేం కారు. వారు సర్ఫరాజ్‌లోని అసలు లోపాలను కనిపెట్టలేకపోయారు' అని డబ్ల్యూవీ రామన్‌ అన్నారు.


మైదానం బయటా, లోపల క్రికెటర్ల ప్రవర్తన గురించి సెలక్టర్లు మాట్లాడుకుంటారని రామన్‌ తెలిపారు. 'సెలక్షన్‌ కమిటీ మీటింగ్‌లో సాధారణంగా ఏం జరుగుతుందంటే..! క్రికెటర్‌ చేసిన పరుగులు, సాధించిన గణాంకాలను మాత్రమే చూడరు. ఇతర అంశాలనూ మాట్లాడుకుంటారు. క్రికెటర్‌ టెక్నిక్‌ లేదా ఆటగాళ్ల వైఖరి గురించి చర్చిస్తారు. లేదా ఇంటర్నేషనల్‌ క్రికెట్లో పోటీని తట్టుకుంటాడా? రాణించగలడా అనేవీ మాట్లాడతారు. అంతర్జాతీయ స్థాయి పేసర్లను అతడు తట్టుకుంటాడో లేదో బహుశా సెలక్టర్లు డిస్కస్‌ చేసి ఉండొచ్చు. సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం సహజమే. ఇంతకు ముందూ జరిగింది. ఈ కమిటీ అలాగే చేసింది. ఇక ముందూ చేస్తారు' అని ఆయన వెల్లడించారు.


భారత టెస్టు జట్టు: రోహిత్‌ శర్మ (కె), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్‌, యశస్వీ జైశ్వాల్‌, కేఎస్ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌, నవదీప్‌ సైనీ


భారత వన్డే జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ (వి), ఇషాన్‌ కిషన్‌ (వి), హార్దిక్‌ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌ కుమార్‌