Indias Squad Announcement For Last Three Tests: స్వదేశంలో ఇంగ్లాండ్(England)తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli)సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రాకపోడవంతో అతడిని జట్టులోకి తీసుకోలేదు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ మిగిలిన సిరీస్‌ల ఎంపికకు అందుబాటులో ఉండడని బీసీసీఐ(Bcci) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని... మద్దతుగా నిలుస్తుందని బీసీసీఐ వెల్లడించింది. రవీంద్ర జడేజా, KL రాహుల్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసినా... వైద్య బృందం పరిశీలించిన ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తేనే తుది జట్టులో స్థానం దక్కుతుందని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. గాయంతో శ్రేయస్స్ అయ్యర్‌పై ఈ మూడు టెస్టులకు చోటు దక్కలేదు. తెలుగు కుర్రాడు భరత్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. మూడో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇస్తారన్న వార్తలు పటాపంచలు చేస్తూ ఈ పేసు గుర్రాన్ని మిగిలిన టెస్టులకు ఎంపిక చేశారు.
ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కె.ఎస్. భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
ఇందుకే అయ్యర్ దూరం
శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు పాత గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న అయ్యర్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో చేరినట్లు తెలుస్తోంది. అయ్యర్ తిరిగి మళ్లీ ఐపీఎల్‌తో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన అయ్యర్ అంచనాలను అందుకో లేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 26 సగటుతో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అయ్యర్ దూరమవ్వడంతో అతని స్థానంలో దేశవాళీలో పరుగుల వరద పాలిస్తున్న సర్ఫరాజ్ ఖాన్(sarfaraz khan)కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ మిగిలిన టెస్టులకు దూరమయ్యాడు. ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు.. ఈనెల 23 నుంచి రాంచీ నాలుగో టెస్ట్... మార్చి 7 నుంచి ధర్మశాలలో అయిదో టెస్ట్ జరగనున్నాయి.
తుది జట్టులో జడ్డూ కూడా కష్టమే....?
తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజా తుది జట్టులో చేరడం కష్టంగా తెలుస్తోంది. జడ్డూ గాయం చాలా తీవ్రమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. జడ్డూ ఒకవేళ రాంచీలో జరిగే నాలుగో టెస్ట్ సమయానికి కోలుకుంటే అది అద్భుతమే అని తెలుస్తోంది.