U19 Cricket World Cup final: అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup)లో ఆదివారం అసలు సమరం జరగనుంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. ఇప్పుడు అండర్ 19 ప్రపంచకప్ తుది సమరంలో మరోసారి టీమిండియా-ఆస్ట్రేలియా(India vs Australia) తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో ఓటమికి యువ భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో కంగారులపై గెలిచిన టీమిండియా మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.
బలంగా ఇరు జట్లు
భారత్, ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మధ్య గట్టి పోరు తప్పదని భావిస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ రికార్డు స్థాయిలో 9వ సారి ఫైనల్స్‌కు చేరుకోగా, ఆస్ట్రేలియన్ జట్టు ఆరోసారి ఫైనల్ చేరింది. ఇంతకు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో రెండుసార్లు తలపడగా, ఈ రెండు మ్యాచులలో భారత్ విజయం సాధించింది. ఇప్పుడుకూడా ఆ విజయ పరంపరను కొనసాగించాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
ఎక్కడ చూడాలంటే...?
సహారా పార్క్ విల్లోమూర్ క్రికెట్ స్టేడియంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ఫిబ్రవరి 11 ఆదివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్...స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రారంభం కానుంది.
తొమ్మిదోసారి ఫైనల్‌కు....
అండర్ 19 ప్రపంచకప్ లో వరుసగా ఐదోసారి ఫైనల్ చేరిన భారత జట్టు రికార్డు సృష్టించింది. మొత్తం మీద తొమ్మిదో సారి అండర్ 19 ప్రపంచకప్ తుదిపోరుకు అర్హత సాధించి కొత్త చరిత్ర లిఖించింది. 2016, 2018, 2020, 2022, 2024, అండర్-19 ప్రపంచ కప్ టోర్నీల్లో వరుసగా టీమిండియా ఫైనల్ చేరింది. 2016, 2020, టోర్నీలో రన్నర్ అప్ గా నిలిచిన భారత్.... 2018 2022 టోర్నీల్లో విజేతగా నిలిచి సత్తా చాటింది. ఇప్పటివరకు మొత్తం ఐదుసార్లు అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న టీమిండియా... ఆరో కప్పుపై కన్నేసింది.
సెమీస్‌లో గెలిచిందిలా..?
బెనోని లోని విల్లోమోర్ పార్క్ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. సౌతాఫ్రికా జట్టులో ప్రిటోరియస్ 76, రిచర్డ్ సెలెట్స్వేన్ 64 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో లింబాని మూడు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ 2, స్పిన్నర్ సౌమి పాండే ఒక వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ బ్యాటర్లకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 14 పరుగులు చేసిన ఓపెనర్ స్టీవ్ స్టాక్.. ఐదో ఓవర్లోనే అవుటయ్యాడు. డేవిడ్ టీగర్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను ప్రిటోరియస్... రిచర్డ్ సెలెట్స్వేన్ ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన వీరిద్దరూ మంచి భాగస్వామ్యంతో ప్రోటీస్‌ను మళ్లీ పోరులోకి తెచ్చారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఈ జోడీని ముషీర్ ఖాన్ విడదీశాడు. అర్థ సెంచరీ చేసుకున్నాక రిచర్డ్.. నమన్ తివారి బౌలింగ్‌లో ప్రియాన్షుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖర్లో కెప్టెన్ జువాన్ జేమ్స్ 24, ట్రిస్టన్ లుస్ 23 నాటౌట్ దూకుడుగా ఆడటంతో సఫారీ స్కోరుబోర్డు 244లకు చేరింది.