WTC Final 2023:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (WTC Final 2023) టీమ్‌ఇండియాను ప్రకటించారు. పదిహేను మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత 'మిస్టర్ డిపెండబుల్' అజింక్య రహానెకు చోటు దక్కింది. జూన్ 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరుగుతుంది. జూన్ 12ను రిజర్వు డేగా ప్రకటించారు. లండన్‌లోని ఓవల్ మైదానం ఇందుకు వేదిక. డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాలతో హిట్‌మ్యాన్ సేన తలపడుతుంది.
టీమ్‌ఇండియాకు దొరికిన అద్భుతమైన ఆటగాళ్లలో అజింక్య రహానె (Ajinkya Rahane) ఒకడు. దేహానికి దూరంగా వెళ్తున్న బంతుల్ని చక్కగా ఆడతాడు. స్వింగ్, సీమ్, క్రాస్ సీమ్, స్పిన్‌ను బాగా ఎదుర్కొంటాడు. విదేశాల్లో పేసర్లు వేసే బంతుల్ని అడ్డంగా ఆడగలడు. ఏడాది కాలంగా అతడు ఫామ్‌లో లేడు. దాంతో వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించారు. దక్షిణాఫ్రికాలో కౌప్‌టౌన్ టెస్టు నుంచి పక్కన పెట్టేశారు. ఆ పర్యటనలో 6 ఇన్సింగ్సుల్లో అతడు 136 పరుగులే చేశాడు.
శ్రీలంక సిరీస్ నుంచి అజింక్య రహానెను ఎంపిక చేయడమే లేదు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. వెన్నెముక గాయంతో అతడు అందుబాటులో లేకపోవడం.. విదేశీ గడ్డపై ఆడిన అనుభవం మిగతా కుర్రాళ్లకు లేకపోవడంతో మళ్లీ అతడే దిక్కయ్యాడు! అయితే అతడికి తలుపులు మూసేయలేదని.. భవిష్యత్తులో తీసుకొనే అవకాశం ఉందని అప్పటి చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అజింక్య రహానె ఇండియన్ ప్రీమియర్ లీగులో ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వన్డౌన్లో దిగుతూ.. ఊరమాస్ బ్యాటింగుతో పరుగుల వరద పారిస్తున్నాడు. బౌండరీలు, సిక్సర్లు బాదేస్తున్నాడు. తనలోని అసలైన దూకుడును పరిచయం చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రకటించిన జట్టులో ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు. శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అజింక్య రహానె ఆ బాధ్యత తీసుకుంటారు. విశాఖ కుర్రాడు కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. అతడికి పోటీగా మరెవ్వరూ లేరు కాబట్టి తుది జట్టులో ఆడటం గ్యారంటీ! ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లను తీసుకున్నారు.
టీమ్‌ఇండియా: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్