Steve Smith News: సిడ్నీలో భారత్ తో జరుగుతున్న ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ డెసిషన్ పై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ నిర్ణయం చెత్త నిర్ణయమని ఘాటుగా విమర్శించాడు. భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ నాలుగోబంతికి యశస్వి జైస్వాల్ (10)ని ఔట్ చేసిన స్కాట్ బోలాండ్.. తర్వాత వచ్చిన కోహ్లీకి ఆఫ్ సైడ్ పై బంతిని సంధించాడు. దీన్ని డిఫెన్స్ కోహ్లీ డిఫెన్స్ ఆడగా, బ్యాట్ అంచును ముద్దాడుతూ అది స్లిప్ వైపు వెళ్లింది. రెండో స్లిప్ లో కాపు కాసిన స్మిత్ డైవ్ చేస్తూ బంతిని అందుకోడానికి ప్రయత్నించగా, అతని చేతిని తాకుతూ, అది గల్లీలో ఉన్న మార్నస్ లబుషేన్ చేతుల్లో పడింది. అయితే దీనిపై అంపైర్లు..థర్డ్ అంపైర్ కి నివేదించాడు.
బంతి నేలను తాకిందని..
అయితే బంతిని నిశితంగా పరిశీలించిన థర్డ్ అంపైర్ జోయెల్ గార్నర్ అది నేలను తాకిందని నిర్ధారించి, కోహ్లీని నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ ప్లేయర్లలో నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా స్మిత్ తలను అసహనంగా అడ్డంగా ఊపుతూ కనిపించాడు. అయితే లంచ్ విరామ సమయంలో ఈ విషయంపై స్మిత్ ను కామెంటేటర్ ఇషా గుహా ప్రశ్నించింది. తన చేయి కచ్చితంగా బంతి కిందే ఉందని, బాల్ నేలను తాకలేదని నమ్మకంగా చెప్పాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం చెత్త నిర్ణయమన్నట్లుగా మాట్లాడాడు. ఏదేమైనా ఆటలో ఇవి సహజమని, నిర్ణయం తీసుకున్నారని, ఇక ముందుకు సాగాల్సిందేనని పేర్కొన్నాడు. ఈ సిరీస్ లో వరుసగా థర్డ్ అంపైర్ నిర్ణయాలపై అసహనం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్టులో యశస్వి జైస్వాల్ ను డిఫ్లెక్షన్ పేరుతో ఔట్ గా ప్రకటించడం ప్రకంపనలు రేపింది. సోషల్ మీడియాలో భారత ఫ్యాన్స్ మండి పడ్డారు.
పీకల్లోతు కష్టాల్లో భారత్..
బ్యాటర్ల వైఫల్యంతో సిడ్నీ టెస్టులో భారత్ ఇబ్బందులు పడుతోంది. 60 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్లకు 123 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10), శుభమాన్ గిల్ (20) లంచ్ లోపే వెనుదిరిగారు. విరామం తర్వాత విరాట్ కోహ్లీ (17), రిషభ్ పంత్ (40), నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యి పెవిలియన్ కు చేరారు. రవీంద్ర జడేజా 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ (0) పరుగులతో క్రీజులో ఉన్నాడు. బౌలర్లలో స్కాట్ బోలాండ్ కు నాలుగు వికెట్లు దక్కాయి. నాథన్ లయన్, మిషెల్ స్టార్క్ కు రెండేసి వికెట్లు దక్కాయి. ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో ఆసీస్ ఆధిక్యంలో ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఈ టెస్టులో భారత్ కు గెలుపు తప్పనిసరి.