Sydney Test Updates: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదోటెస్టులో భారత ఆటగాళ్లు మరోసారి విఫలమయ్యారు. కచ్చితంగా నెగ్గాల్సిన సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేశారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (68 బంతుల్లో 17) మరోసారి తన ఆఫ్ స్టంప్ బలహీనతను ప్రదర్శించాడు. ఈ సిరీస్ లో మరోసారి ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతిని వేటాడి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా (11 బ్యాటింగ్), రిషభ్ పంత్ (32 బ్యాటింగ్)తో కలసి మరో వికెట్ పడకుండా టీ విరామానిక వెళ్లారు. దీంతో టీ విరామానికి భారత్ స్కోరు 50 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసింది. స్కాట్ బోలాండ్ కు రెండు వికెట్లు దక్కాయి.
రెండు మార్పులతో బరిలోకి భారత్..
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులు చేసింది. ఫామ్ లో లేని కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో వన్ డౌన్ బ్యాటర్ శుభమాన్ గిల్ ను జట్టులోకి తీసుకుంది. దీంతో కేఎల్ రాహుల్ తన ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. మరోవైపు గాయం బారిన పడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తుది జట్టులోకి తీసుకుంది. ఇక ఆసీస్ కూడా ఒక మార్పు చేసింది. ఫామ్ లో లేని స్టార్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో బ్యూ వెబ్ స్టర్ ను జట్టులోకి తీసుకుంది. అంతర్జాతీయంగా వెబ్ స్టర్ కు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
మళ్లీ విఫలమైన బ్యాటర్లు..
ఓపెనింగ్ జోడీ మారిన భారత రాత మారలేదు.. స్టార్క్ బౌలింగ్ లో లెగ్ స్టంప్ పై వచ్చిన బంతిని నేరుగా కొన్ స్టాస్ చేతిలోకి ఆడి కేఎల్ రాహుల్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత కుదురుగా ఆడిన యశస్వి జైస్వాల్ (10) ను స్కాట్ బోలాండ్ బోల్తా కొట్టించాడు. లెగ్ స్టంప్ ఇవతల పిచ్ అయిన బంతిని జైస్వాల్ డిఫెన్స్ ఆడబోగా, అది ఎడ్జ్ తీసుకుని స్లిప్ లో వెబ్ స్టర్ చేతిలో పడింది. దీంతో 17 పరుగులకే భారత్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ తర్వాత వచ్చిన కోహ్లీ.. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయట పడ్డాడు. బోలాండ్ వేసిన బంతిని కోహ్లీ ఆడగా, అది స్లిప్ లోకి వెళ్లింది. అయితే డైవ్ చేసిన స్మిత్ బంతిని అందుకోడానికి ప్రయత్నించగా, అది స్మిత్ చేతిని తాకి బౌన్స్ అయ్యి లబుషేన్ చేతిలో పడింది. అయితే క్యాచ్ పై అంపైర్లు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేయగా, రిప్లేలో బంతి నేలను తాకిందని తేల్చి, నాటౌట్ గా థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే తనకు దొరికిన లైఫ్ ను కోహ్లీ సద్వినియోగం చేసుకోలేదు. 67 బంతులపాటు ఓపికగా ఆడిన కోహ్లీ.. చివరికి తన ఆఫ్ స్టంప్ బలహీనతకే బలయ్యాడు.
అంతకుముందు లంచ్ విరామం చివరి బంతికి శుభమాన్ గిల్ (20) ఔటయ్యాడు. లయన్ బౌలింగ్ లో ముందుకొచ్చి డిఫెన్స్ ఆడబోగా, అది ఎడ్జ్ తీసుకుని స్లిప్ లోకి వెళ్లింది. అక్కడే పొంచి ఉన్న స్మిత్ చక్కకి క్యాచ్ అందుకున్నాడు. దీంతో 57/3తో భారత్ నిలిచింది. ఆ తర్వాత కోహ్లీ కూడా కాసేపటికే ఔటవడంతో భారత్ కష్టాల్లో నిలిచింది. ఈ దశలో పంత్, జడేజా జోడీ సంయమనంతో ఆడింది. ఏమాత్రం కంగారు పడకుండా ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, మరో వికెట్ పడకుండా టీ విరామనికి వెళ్లారు. ఈ క్రమంలో అబేధ్యమైన నాలుగో వికెట్ కు 35 పరుగులు జోడించారు.
Also Read: ఐదో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్, టీమిండియా కెప్టెన్ పేరిట చెత్త రికార్డు! - క్లారిటీ ఇచ్చిన బుమ్రా