Rohit Sharma and Virat Kohli: ఇది అప్పుడెప్పుడో వచ్చిన ఫేమస్ సినిమాలో హీరో డైలాగ్ కాదు. ఇప్పుడు.. మన క్రికెట్ హీరోల గురించి సగటు అభిమానులు చేస్తున్న కామెంట్. నేను మాట్లాడుతోంది.. రోహిత్ కోహ్లీ గురించే. ఇండియాలో వాళ్ల ఫ్యాన్ బేస్ ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్లిద్దరి రికార్డులు తెలిసే మాట్లాడుతున్నావా అని ఫ్యాన్ బోయ్స్ నా పై కోప్పడొచ్చు. అవన్నీ నాక్కూడా తెలుసు. నేను కూడా ఫ్యానే. కానీ అంతటి అభిమానులు కూడా హర్ట్ అయ్యేలా ఉంటోంది వాళ్ల ఆటతీరు. ఆస్ట్రేలియా టూర్ లో ఫెయిల్ అయింది మొదలు.... ‘Happy Retirement’ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. 


విరాట్ అంటే తిరుగులేని స్టార్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇన్ క్రికెట్ హిస్టరీ. రోహిత్ ఇండియన్ క్రికెట్‌లో ఓ లెజెండ్. ఇలాంటి వాళ్లు వాళ్లంతట వాళ్లు రిటైర్ అయ్యేవరకూ అభిమానులు ఎదురు చూస్తుంటారు. సచిన్, ధోనీ విషయంలో అలాగే  జరిగింది. వీళ్లు కూడా నచ్చినప్పుడు రిటైర్ అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితులు అలా లేవు. కోహ్లీ విషయంలో ఇంకో సీజన్ వరకూ చూస్తారేమో కానీ రోహిత్ విషయంలో అయితే ఏ మాత్రం ఒప్పుకునేలా లేరు. ఇండియన్ కెప్టెన్‌కు లాస్ట్ టెస్టులో ప్లేస్ లేకుండా పోయింది. 


మెల్‌బోర్న్ టెస్టులో చివరి రోజు 340 రన్స్ టార్గెట్. విరాట్, రోహిత్ లాంటి వాళ్ల లైనప్‌తో అది సాధ్యమే అనుకోవడం నా లాంటి నార్మల్ క్రికెట్ అభిమానుల తప్పు కాదు. పోనీ టార్గెట్ చేజ్ చేయకపోయినా కనీసం డ్రా వరకూ లాక్కొస్తారులే అనుకుంటారు. కానీ ఏం జరిగింది..? ఒకరు 9, ఇంకొకరు 5 రన్స్ చేశారు. పోన్లే ఎప్పుడో ఓసారి ఇలా జరుగుతుందనుకోవడానికి లేదు. ఈ ఏడాదంతా అలాగే జరిగింది. ఆస్ట్ట్రేలియాతో ఇప్పటి వరకూ జరిగిన 4 టెస్ట్ మ్యాచ్‌లు అయినా.. అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లో అయినా డబుల్ డిజిట్ చేయడానికి వీళ్లు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. కోహ్లీ అంటే పెర్త్ టెస్టులో ఓ వంద కొట్టి కాస్త పరువు నిలుపుకున్నాడు కానీ రోహిత్ ఫామ్ ఘోరాతిఘోరం. 2024 టెస్ట్ క్రికెట్ వీళ్లిద్దరికీ ఓ పీడకల అనుకోవాలేమో... ఈ ఏడాది వీళ్లిద్దరి యావరేజ్ కేవలం 24. 19 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 417 పరుగులు చేస్తే.. 26 ఇన్నింగ్సులు ఆడిన రోహిత్ 619 చేశాడు. 


పదేళ్ల కిందట ఇదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు సెంచరీలు కొట్టిన కోహ్లీ.. ఇప్పుడు ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. రోహిత్ అయితే సింగిల్ డిజిట్ దాటితే అది మహాభాగ్యంలా కనిపిస్తోంది. వీళ్లిద్దరి టాలెంట్, వీళ్లు సాధించిన ఘనతలపై అందరికీ గౌరవం ఉంది.. కానీ ఇలా ఎంతకాలం...? ఇలా కొనసాగించడం వల్ల జరిగే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు..? రన్స్ చేయకుండా వీళ్లని టీమ్‌లో ఉంచడం వల్ల యువ బ్యాట్స్‌మన్‌లకు అవకాశం రాకుండా పోతోంది. శుభమన్‌గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వంటి వాళ్లకి అవకాశం రావడం లేదు. అంతెందుకు మొన్న 8వ స్థానంలో ఆడి సెంచరీ చేసిన నితీష్ రెడ్డిని ముందుకు పంపించే అవకాశం కూడా రావడం లేదు. 


విరాట్ సంగతి పక్కన పెట్టినా రోహిత్‌కు మాత్రం రిటైర్మెంట్ తప్పేలా లేదు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే సిడ్నీ టెస్టులో అతన్ని తీసుకోలేదు. అతని స్థానంలో బుమ్రాకు మరోసారి కెప్టెన్ పగ్గాలు అప్పగించారు. రెగ్యులర్‌ కెప్టెన్‌కే ఈ పరిస్థితి రావడం ఎంత అప్రతిష్ట...? కెప్టెన్‌గా కూడా ఆయన రికార్డు బాలేదు. న్యూజిలాండ్‌తో వైట్ వాష్. ఇప్పుడు సిరీస్ పోతే.. మన WTC ఫైనల్ ఛాన్స్‌ పోతుంది. ఓవర్సీస్ పక్కన పెడితే రోహిత్ ఇండియాలో కూడా ఫెయిల్. లాస్ట్ 10 టెస్ట్ ఇన్నింగ్సులు తీసుకుంటే.. 2,0,8,11,3,6, 3,9 ఇలా ఉంటాయి అతని స్కోర్లు. అంతే కాదు. అతని వయసు కూడా 38కి చేరువైంది. సో.. ఇవన్నీ లెక్కలేసుకుని సెలక్టర్లు నిస్సందేహంగా రోహిత్‌ను ‘ఇక చాలు’ అని చెప్పొచ్చు.


కోహ్లీ పరిస్థితి మరీ ఇంత తీసికట్టు కాకపోయినా ఆతని నుంచి ఆశించేది ఇది కాదు కదా.. అవుటవ్వడం వేరు. దురదృష్టం వెంటాడిందిలే అనుకోవచ్చు. కానీ.. కోహ్లీ డిఫరెంట్. దురదృష్టాన్ని మనోడే వెంటాడతాడు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్తున్న బంతిని వెంటాడి వేటాడి కీపర్‌కు చిక్కడంలో మనోడిని మించినోడు లేడు. ఒక్కసారి జరిగితే పొరపాటు.. రెండోసారి జరిగితే గ్రహపాటు.. మూడోసారి అంటే మిడిసిపాటే కదా.. అసలు అలా ఎలా అవుట్ అవుతావ్ బాసూ అని అభిమానులు విసుక్కుంటున్నారు. తన కాంటెంపరరీ ప్లేయర్లు ఎంతో ఓపికతో ఆడుతుంటే.. విరాట్ మాత్రం వికెట్ గిరాటేస్తున్నాడు.  


లాస్ట్ 5 ఏళ్లలో విరాట్ చేసిన టెస్ట్ సెంచరీలు ఎన్నో తెలుసా.. ? కేవలం మూడు. అవును. ద గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించే అతను చేసింది మూడే సెంచరీలు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కన్సిస్టెంట్ పర్‌ఫార్మెన్స్ ఇస్తున్నాడు. విరాట్‌తో పాటే కెరీర్ స్టార్ట్ చేసి ఒకప్పుడు అతని కంటే వెనుకున్న జో రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ అతన్ని దాటేశారు. జో రూట్ లాస్ట్ 5 ఏళ్లలో 19 సెంచరీలు చేయగా.. కేన్స్ 12 సెంచరీలు, స్మిత్ 8 సెంచరీలు చేశారు. జో రూట్ చేసిన దాంట్లో సగం రన్స్ కూడా విరాట్ చేయలేకపోయాడు. ఒకప్పుడు ఇలాగే ఆస్ట్రేలియాలో ఆఫ్ స్టంప్ బంతుల వెనుకపడి అవుటైన విరాట్ ఆ తర్వాత పట్టుదలతో నిగ్రహంగా ఆడి ఇంగ్లండ్ హోమ్ సిరీస్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటికీ విరాట్‌లో ఆట మిగిలే ఉంది. లేనిదల్లా నిగ్రహమే. సిడ్నీ ఇండియాకు అచ్చొచ్చిన మైదానం. ఇక్కడ అంతకు ముందు సచిన్, లక్ష్మణ్, విరాట్‌లు సెంచరీలు చేశారు. మళ్లీ అతను ఫామ్‌లోకి వచ్చి తన కెరీర్‌ను గాడిలో పెట్టుకోకపోతే.. నెట్‌లో హ్యాపీ రిటైర్‌మెంట్ స్లోగన్ మోతమోగడం ఖాయం.