Ind vs Eng 3rd Test Day 2 Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. శుక్రవారం రెండోరోజు బ్యాటింగ్ లో కాస్త తడబడిన భారత్.. ఆట ముగిసేసరికి 43 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కంటే 242 పరుగుల వెనుకంజలో ఉంది. ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ సీనియర్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ (113 బంతుల్లో 53 బ్యాటింగ్), రిషభ్ పంత్ (19 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ పొదుపుగా బౌలింగ్ చేసి, కీలక వికెట్ సాధించాడు. మరోవైపు నిన్న గాయపడిన పంత్.. బ్యాటింగ్ కు వచ్చి, సమయోచితంగా ఆడాడు.
రాహుల్ పోరాటం..అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) ఆర్చర్ తన బోలింగ్ లో బోల్తా కొట్టించాడు. దీంతో 13 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశల్ కరుణ్ నాయర్ (40) తో కలిసి రాహుల్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడి, నెమ్మదిగా పరుగులు సాధించారు. ఒక ఎండ్ లో రాహుల్ పాతుకుపోగా, కరుణ్ కాస్త వేగంగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 61 పరుగులు జోడించిన తర్వాత, జో రూట్ పట్టిన అద్బుత క్యాచ్ కు కరుణ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభమాన్ గిల్ (16) క్రీజు కుదురుకున్నట్లుగానే అన్పించినా, ఇంగ్లాండ్ అద్బుత వ్యూహంతో తనను ఔట్ చేసింది. ఇక పంత్ వచ్చిన తర్వాత కాస్త పరుగుల వేగం పెరిగింది. ఈ లోగా రాహుల్ టెస్టుల్లో 19వ ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం రాహుల్-పంత్ జోడీ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. మిగతా బౌలర్లలో బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ కు చెరో వికెట్ దక్కింది.
బుమ్రా ఫైఫర్..మరోవైపు ఓవర్ నైట్ స్కోరు 251/4 తో రెండోరోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ జో రూట్ (104) మరో అద్బుత సెంచరీ సాధించాడు. అయితే కీలక దశలో పుంజుకున్న భారత స్టార్ జస్ ప్రీత్ బుమ్రా మూడు వికెట్లను వెంటవెంటనే తీయడంతో ఒక దశలో 271/7 తో కష్టాల్లో నిలిచింది. ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ (51), బౌలింగ్ ఆల్ రౌండర్ బ్రైడెన్ కార్స్ (56) ఎనిమిదో వికెట్ కు 84 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ సవాలు విసరగలిగే స్కోరును సాధించింది. ఆఖర్లో ఆర్చర్ (4) వికెట్ తీసిన బుమ్రా.. ఫైఫర్ ను సాధించాడు. మిగతా బౌలర్లలో మహ్మద్ సిరాజ్, నితీశ్ రెడ్డి రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు.