Jasprit Bumrah gets fifer:  మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఎట్ట‌కేల‌కు ఆలౌటైంది. లోయ‌ర్ ఆర్డ‌ర్ ను త్వ‌ర‌గా ఔట్ చేయ‌లేని బ‌ల‌హీన‌త‌ను టీమిండియా మ‌రోసారి బ‌య‌ట పెట్టుకుంది. శుక్ర‌వారం మూడో టెస్టులో ఇంగ్లాండ్ 112.3 ఓవ‌ర్ల‌లో 387 ప‌రుగుల‌కు ఆలౌటైంది. వెట‌ర‌న్ బ్యాట‌ర్ జో రూట్ అద్భుత మైన సెంచ‌రీ (199 బంతుల్లో 104, 10 ఫోర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా (5/74)తో మ‌రో ఫైవ్ వికెట్ హాల్ ను త‌న ఖాతాలో వేసుకుని, లార్డ్స్ హాన‌ర్స్ బోర్డులో త‌న పేరును లిఖించుకున్నాడు. 

బుమ్రా వాడి..రెండో రోజు ఉద‌యం ఓవ‌ర్ నైట్ స్కోరు 251/5 తో తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన ఇంగ్లాండ్.. త్వ‌ర‌గానే మూడు వికెట్ల‌ను కోల్పోయింది. ముఖ్యంగా ఓవ‌ర్ నైట్ స్కోరు (99) తో బ్యాటింగ్ కు వ‌చ్చిన రూట్.. తొలి బంతికే బౌండ‌రీని బాది, సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇండియాపై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన స్టీవ్ స్మిత్ (11) రికార్డును స‌మం చేశాడు. ఈ ద‌శ‌లో బౌలింగ్ కు వ‌చ్చిన బుమ్రా.. ఇంగ్లాండ్న ను వ‌ణికించాడు. తొలుత స్టోక్స్ (44) అద్భుత బంతితో బౌల్డ్ చేయ‌గా, కాసేప‌టికే రూట్ ను కూడా బౌల్డ్ చేసి పెవిలియ‌న్ కు పంపాడు. ఆ త‌ర్వాత టెయిలెండ‌ర్ క్రిస్ వోక్స్ ను డ‌కౌట్ చేయ‌డంతో 271/7 తో ఇంగ్లాండ్ క‌ష్టాల్లో ప‌డింది. 

ఆదుకున్న స్మిత్, కార్స్..ఈ దశ‌లో భార‌త్ ఆధిప‌త్యం ప్ర‌దర్శించ‌గా అద్భుత భాగ‌స్వామ్యంతో ఇంగ్లాండ్ ను జామీ స్మిత్ (51), బ్రైడెన్ కార్స్ (56) గేమ్ లోకి తీసుకు వ‌చ్చారు. ఆరంభంలో కాసేపు ఆచి తూచి ఆడిన ఈ జంట‌.. ఆ త‌ర్వాత బ్యాట్ ఝ‌ళిపించి వేగంగా ప‌రుగులు రాబ‌ట్టారు. ముఖ్యంగా అద్భుత ఫామ్ లో ఉన్న స్మిత్ మ‌రోసారి త‌న వాడిని చూపించాడు. దూకుడుగా ఆడాడు. దీంతో ఎనిమిదో వికెట్ కు 84 ప‌రుగులు జోడించారు. ఫిఫ్టీ చేసుకున్న త‌ర్వాత స్మిత్ ను బుమ్రా ఔట్ చేసి, ఫైఫ‌ర్ కంప్లీట్ చేసుకున్నాడు. మ‌రో ఎండ్ లో పోరాడిన కార్స్ కూడా కాసేప‌టికి ఫిఫ్టీ పూర్తి చేసుకుని, చివ‌రి వికెట్ గా పెవిలియ‌న్ కు చేరాడు. ఇక చివరి మూడు వికెట్లకు ఏకంగా 116 పరుగులు సమర్పించుకుని, లోయర్ ఆర్డర్ ను త్వరగా ఔట్ చేయలని బలహీనతను మరోసారి బారత బౌలర్లు బయట పెట్టుకున్నారు. ముక్యంగా కార్స్ ఫిఫ్టీ చేయడంతో ఇంగ్లాండ్ అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా పరుగులు సాధించింది.  మిగ‌తా బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్, నితీశ్ రెడ్డికి రెండేసి వికెట్లు ద‌క్కాయి.