Joe Root on 99 Batting: ఇండియాతో జ‌రుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆచితూచి ఆడింది. త‌న స్వ‌భావానికి విరుద్ధంగా ఆడిన స్టోక్స్ సేన త‌క్కువ ప‌రుగుల‌నే సాధించింది. గురువారం లార్డ్స్ లో ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ లో తొలి రోజు ఆట‌ముగిసేస‌మ‌యానికి 83 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల‌కు 251 ప‌రుగులు సాధించింది. వెట‌ర‌న్ బ్యాట‌ర్ జో రూట్ అజేయ అర్ధ సెంచ‌రీ (191 బంతుల్లో 99 బ్యాటింగ్, 9 ఫోర్లు)తో, కెప్టెన్ బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తెలుగు ఆల్ రౌండ‌ర్ నితీశ్ రెడ్డికి రెండు వికెట్లు ద‌క్కాయి. బ్యాటింగ్ తోపాటు బౌలింగ్ కు కూడా కాస్త క‌ష్ట‌సాధ్య‌మైన ఈ పిచ్ పై అటు ప‌రుగుల కోసం, ఇటు వికెట్ల కోసం బౌల‌ర్లు శ్రమించారు. 

 

నితీశ్ డబుల్ బ్లో..టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కు ఓపెన‌ర్లు కాస్త శుభారంభ‌మే అందించారు. ఓపెన‌ర్లు బెన్ డ‌కెట్ (23), జాక్ క్రాలీ (18) కాస్త కాన్ఫిడెంట్ గా ఆడుతూ, ఆరంభంలో భార‌త బౌల‌ర్ల‌ను నిలువ‌రించారు. వీరిద్ద‌రూ ఓపిక‌గా ఆడుతూ, తొలి వికెట్ కు 43 ప‌రుగులు జోడించారు. అయితే ఈ ద‌శ‌లో భార‌త కెప్టెన్ శుభ‌మాన్ గిల్ చేసిన బౌలింగ్ చేంజ్ ఊహించ‌ని ఫ‌లితాన్నిచ్చింది. నితీశ్ రెడ్డి ఒకే ఓవ‌ర్లో ఓపెన‌ర్ల‌ద్దిరిని పెవిలియ‌న్ కు పంపాడు. ముందుగా డ‌కెట్ ను లెగ్ సైడ్ బంతిని వేసి డ‌కెట్ ను పెవిలియ‌న్ కు పంపిన నితీశ్.. అదే ఓవ‌ర్ లో మ‌రో ఓపెన‌ర్ క్రాలీని అన్ ప్లేయ‌బుల్ డెలీవ‌రితో ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ఒల్లీ పోప్ (44)తో క‌లిసి రూట్ జ‌ట్టును ఆదుకున్నాడు. వీరిద్ద‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ఆడుతూ, స్కోరు బోర్డును ముందుకు న‌డిపించారు. 

రూట్ జోరు..మంచి బంతుల‌ను గౌర‌విస్తూ, చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లిస్తూ రూట్- పోప్ జోడీ ఇంగ్లాండ్ ను ఆదుకుంది. వీరిద్ద‌రూ లంచ్ విరామంతోపాటు ఆ త‌ర్వాత టీ విరామం వ‌ర‌కు మొత్తం బ్యాటింగ్ చేశారు. దీంతో మూడో వికెట్ కు 109 ప‌రుగులు జోడించారు. అయితే టీ విరామం త‌ర్వాత తొలి బంతికే జ‌డేజా బౌలింగ్ లో కీప‌ర్ ధ్రువ్ జురెల్ పట్టిన అధ్బుత‌మైన క్యాచ్ కు ఔట‌య్యాడు. దీంతో ఈ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే అద్భుత‌మైన బంతితో హేరీ బ్రూక్ (11)ను జ‌స్ ప్రీత్ బుమ్రా పెవిలియ‌న్ కు పంపాడు. ఆ తర్వాత రూట్-స్టోక్స్ జంట మ‌రో వికెట్ ప‌డ‌కుండా రోజును ముగించింది. ముఖ్యంగా కీల‌క‌ద‌శ‌లో ఐదో వికెట్ కు అజేయంగా 79 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. చివ‌ర్లో రూట్ సెంచ‌రీ పూర్త‌వుతుంద‌ని అంతా భావించినా, వీలు కాలేదు. సెంచ‌రీ కోసం త‌ను మ‌రో రోజు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. ఇక మిగ‌తా భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, జ‌డేజాకు ఒక వికెట్ ద‌క్కింది. ఇక ఈ మ్యాచ్ లో కీపింగ్ చేస్తూ, రిషభ్ పంత్ గాయపడ్డాడు. అతను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. రేపు బరిలోకి దిగేది, లేనిది అనుమానంగా ఉంది.