Subhman Gill Spoke In Telugu at Lords Test For Nitish Kumar Reddy: ఇంగ్లాండ్‌ గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్టు లార్డ్స్‌లో ప్రారంభమైంది. ఈ టెస్టులో కూడా భారత్ కెప్టెన్‌ టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీష్‌ రెడ్డి బౌలింగ్‌తో అదరగొట్టాడు. నితీష్ పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన కెప్టెన్ గిల్‌ మామా అంటూ మరింత ఉత్సాహపరిచాడు. స్టంప్స్ మైక్‌లో రికార్డు అయిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

టీమిండియా మరోసారి టాస్ గెలవడంలో విఫలమైంది, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇది వరుసగా మూడో టాస్ ఓటమి. లార్డ్స్‌లో జరిగిన మూడవ టెస్ట్‌లో, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి బౌలింగ్ స్పెల్‌ను జస్పిత్‌ బుమ్రా, ఆకాశ్‌ దీప్‌ ప్రారంభించారు. పది ఓవర్ల తర్వాత కూడా వికెట్ రాకపోవడంతో బౌలింగ్ స్పెల్ మార్చారు. నితీష్‌ రెడ్డిని బౌలింగ్‌కు దించాడు కెప్టెన్ గిల్. 

కెప్టెన్ తనపై ఉంచి నమ్మకాన్ని నితీష్ ప్రూవ్ చేసుకున్నాడు. మూడో బంతికే డకెట్‌ను అవుట్ చేశాడు. రెండో బంతికి ఫోర్ కట్టిన ఇంగ్లీష్ ఓపెనర్‌ను తర్వాత బంతికే బోల్తా కొట్టించాడు. లెగ్‌ సైడ్ వేసిన షార్ట్ బంతి రావడంతో దాన్ని కూడా బౌండరిగా మార్చాలని చూశాడు. కానీ అతని ఎత్తు పారలేదు. బంతి డకెట్ గ్లౌవ్‌కు తగిలి పంత్ చేతికి చిక్కింది. అంతే 23 పరుగులు చేసిన డకెట్‌ పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. 

అదే ఓవర్‌లో ఆఖరి బంతికి నితీష్‌ రెడ్డి మరో మ్యాజిక్ చేశాడు. ఈసారి మరో ఓపెనర్‌ క్రాలేని అవుట్ చేశాడు. 4 బంతుల వ్యవధిలోనే ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేశాడు. బంతిని లూప్ చేయడంతో క్రాలే టెంప్ట్‌ అయ్యాడు. దీంతో బంతి గ్లోవ్‌ను తాకుతూ స్టంప్స్ వెనుక ఉన్న పంత్ చేతిలో పడింది. దీంతో క్రాలే 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

తొలి ఓవర్‌లోని వికెట్లు తీయడంతో టీమిండియా కెప్టెన్‌ సహా సహచర ఆటగాళ్లంతా నితీష్‌ రెడ్డిని మరింతగా ప్రోత్సహించారు. తెలుగులో మాట్లాడుతూ శభాష్ అంటూ కితాబు ఇచ్చారు. ఓ అద్భుతమైన బంతిని చూసి బాగుందిరా మామా అంటూ పొగడటం స్టంప్‌మైక్‌లో రికార్డు అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగుందిరా మామా అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది. అంతే కాదు వాట్‌ రా రెడ్డి అనే మాట కూడా బాగా ట్రెండ్ అవుతుంది. 

సాధారణంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు ఒకే టీంలో ఉండటంతో వారి వారి భాషల్లో ఉండే ట్రెండీ వర్డ్స్‌ తరచూ మాట్లాడుతుంటారు క్రికెటర్లు. దీనికి తోడు ఐపీఎల్ రాక కూడా వారిని మరింత లోకలైజ్ చేసింది. ఆయా ఫ్రాంఛైజీల కోసం ప్రమోషన్స్‌ కూడా ఆయా భాషల్లో చేస్తున్నారు. అందుకే ఇలాంటి ట్రెండీ వర్డ్స్‌ను క్రికెటర్లు ఈ మధ్య కాలంలో తరచూ వాడుతున్నారు. ఇప్పుడు నేషనల్ టీమ్‌కు ఆడినప్పుడు కూడా సదరు ఆటగాడిని ప్రోత్సహించేందుకు వారి భాషలోనే చెబుతున్నారు. ఇక్కడ గిల్ చేసింది కూడా అదే. 

మొన్నటి వరకు తగ్గేదేలే  

మొన్నటి ఐపీఎల్ వరకు దేశ విదేశ క్రికెటర్లంతా కూడా తగ్గేదేలే అన్న డైలాగ్‌ను, ఆ బాడీ లాంగ్వేజ్‌ను బాగా వాడేశారు. ఐపీఎల్‌లో భారీ స్కోర్ చేసినా మంచి వికెట్లు తీసిన ఈ సిగ్నేచర్ స్టైల్‌లో క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేవాళ్లు. పుష్ప పాన్ ఇండియా మూవీగా విడుదలైన తర్వాతా ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయింది. విదేశీ క్రికెటర్లు సైతం ఈ డైలాగ్‌తో రీల్స్ చేశారు. గ్రౌండ్‌లో కూడా తగ్గేదేలే అని గడ్డం సవరించి అభిమానుల్లో జోష్ నింపారు.