Ind Vs Sa W odi World cup Final Latest Updates: సౌతాఫ్రికాతో జరుగుతున్న మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ సూపర్బ్ ఫిఫ్టీ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో ఖాఖాకు కు మూడు వికెట్లు దక్కాయి. మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఒక జట్టు ఛేజ్ చేసిన అత్యధిక స్కోరు కేవలం 167 పరుగులే కావడం విశేషం. మిగతా సందర్భాల్లో ఏ జట్టు కూడా ఇంతకుమించి ఛేజ్ చేయలేదు.
సూపర్బ్ ఓపెనింగ్..సెమీస్ కు ముందు రెగ్యులర్ ఓపెనర్ ప్రతీకా రావాల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ తన అనుభవాన్ని చూపించింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు) తో కలిసి సూపర్ ఓపెనింగ్ పార్ట్నర్ షిప్ నమోదు చేసింది. వీరిద్దరూ ఆరంభం నుంచి ఆచితూచి ఆడి, మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫైనల్ అయినప్పటికీ, ఏమాత్రం ప్రెషర్ పెట్టుకోకుండా, మంచి బంతులను గౌరవిస్తూ, లూజ్ బాల్స్ ను బౌండరీలకు తరలించారు. ఈక్రమంలోనే వీరిద్దరూ తొలుత 50, ఆ తర్వాత సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈక్రమంలో 49 బంతుల్లో ఫిఫ్టిని షెఫాలీ పూర్తి చేసుకుంది. కాసేపటికే కట్ షాట్ ఆడబోయి స్మృతి ఔటయ్యింది. దీంతో 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
దీప్తి జోరు..ఇక ఫిఫ్టీ తర్వాత సెంచరీ వైపు దూసుకెళ్లిన షెఫాలీ క్రాంప్స్ రావడంతో కాస్త వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యింది. ఆ తర్వాత సెమీ ఫైనల్ హీరోయిన్ జెమీమా రోడ్రిగ్స్ (24) త్వరగా పెవిలియన్ కు చేరింది. ఈ దశలో వెటరన్లు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (20) , దీప్తి శర్మ (58 బంతుల్లో 58, 3 ఫోర్లు, 1 సిక్సర్) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న దశలో ఒక్కో పరుగు జత చేస్తూ, నాలుగో వికెట్ కు 52 పరుగులను జత చేశారు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో హర్మన్ ఔటయ్యింది. అమన్ జ్యోత్ కౌర్ (12) విఫలమైనా, రిచా ఘోష్ (34) వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఆ తర్వాత కాసేపటికే 53 బంతుల్లో దీప్తి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ కు వెళ్లిన భారత్, రన్నరప్ గానే నిలిచింది. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఇప్పటివరకు కప్పు గెలవలేదు. దీంతో తొలిసారి కొత్త చాంపియన్ ను ఈ మ్యాచ్ తర్వాత చూడనున్నాం.