Ind Vs Aus 3rd T20 Latest Updates: బ్యాటర్లంతా సమష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఇండియా ఐదు వికెట్లతో ఘన విజయం సాధించింది. హోబర్ట్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. విధ్వంసక బ్యాటర్ టిమ్ డేవిడ్ స్టన్నింగ్ ఫిఫ్టీ (38 బంతుల్లో 74, 8 ఫోర్లు, 5 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం ఛేజింగ్ లో భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 49 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచి, త్రుటిలో ఫిఫ్టీ మిస్సయ్యాడు. బౌలర్లలో నాథన్ ఎల్లిస్ కు మూడు వికెట్లు దక్కాయి. ఈ వేదికపై ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అర్షదీప్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
సమష్టి బ్యాటింగ్..ఈ స్టేడియంలో అత్యధిక ఛేజింగ్ 177 కాగా, ఈ మ్యాచ్ లో రికార్డు బ్రేకింగ్ స్కోరుతో బరిలోకి దిగిన భారత్ కు బ్యాటర్లంతా తలో చేయి వేశారు. ఎప్పటిలాగానే ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (16 బంతుల్లో 25, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంత సేపు షేకాడించాడు. కళ్లు చెదిరే రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే అతను ఔటైన తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (11 బంతుల్లో 24, 1 ఫోర్, 2 సిక్సర్లు) బాధ్యత తీసుకుని దూకుడుగా ఆడాడు. మరోవైపు ఓపెనర్ శుభమాన్ గిల్ (17) మరోసారి విఫలమయ్యాడు. ఈ దశలో తెలుగు స్టార్ తిలక్ వర్మ (29) మరో ఉపయుక్త ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ (17) తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. అయితే అద్భుతమైన బౌన్సర్ తో ఎల్లిస్ పటేల్ ను ఔట్ చేశాడు.
వాషింగ్టన్ జోరు..అక్షర్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన వాషింగ్టన్ ఔట్ ఆఫ్ ద సెలబస్ రీతిలో ఆసీస్ పాలిట నిలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా సిక్సర్ తో ఖాతా తెరిచిన వాషి.. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. తిలక్ కూడా అతనికే స్ట్రైక్ ఇవ్వడంతో వాషి రెచ్చిపోయాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ముఖ్యంగా సీన్ అబాట్ బౌలింగ్ ఒక ఫోర్, రెండు కళ్లు చెదిరే సిక్సర్ కొట్టడంతో 17 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత తిలక్ ఔటైనా, జితేశ్ శర్మ (22 నాటౌట్) తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తాజా విజయంతో ఐదు టీ20ల సిరీస్ ను 1-1తో ఇండియా సమం చేసింది. నాలుగో టీ20 గురువారం (ఈనెల 6న) గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతుంది.