Rahul Dravid: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 తర్వాత టీమ్‌ఇండియా కోచింగ్‌ సెటప్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పదవీ కాలాన్ని బీసీసీఐ పొడగించే అవకాశం కనిపించడం లేదు. పరిస్థితులను బట్టి సుదీర్ఘ ఫార్మాట్‌కు ఒక కోచ్‌, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మరో కోచ్‌ను నియమిస్తారని తెలిసింది. మెగా టోర్నీలో ప్రదర్శనను బట్టి బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ద్రవిడ్‌ సైతం కోచ్‌గా కొనసాగేందుకు అయిష్టంగా ఉన్నారని సమాచారం.


టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ రెండేళ్ల పదవీకాలం ఐసీసీ వన్డే ప్రపంచకప్‌తో ముగుస్తుంది. నిజానికి తెల్ల బంతి క్రికెట్లో ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు. చాలా మ్యాచుల్లో ఓడిపోవడం, కొన్ని సిరీసుల్లో వైఫల్యాలు, నిర్ణయాల్లో లోపాలు ఆయన సామర్థ్యంపై ప్రశ్నలు రేకెత్తించాయి. 2013 నుంచి టీమ్‌ఇండియా ఐసీసీ టోర్నీల్లో ఆఖరి దశలో బోల్తా పడుతోంది. 2015 ప్రపంచకప్‌, 2019 ప్రపంచకప్‌లో సెమీస్‌లో వెనుదిరిగింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ ఘోర ప్రదర్శనే చేసింది.


ఇందులో చాలా టోర్నీలకు రవిశాస్త్రి కోచ్‌గా వ్యవహరించాడు. అతడి కోచింగ్‌లోనూ టీమ్‌ఇండియా మెగా టోర్నీలు గెలిచిందేమీ లేదు. అయినప్పటికీ రాహుల్‌ ద్రవిడ్‌పై వచ్చినంత ట్రోలింగ్‌, విమర్శలు ఆయనపై రాలేదు. అందుకే ప్రధాన కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్‌ అయిష్టంగానే ఉన్నాడని తెలిసింది. అంతే కాకుండా ఎడతెరపి లేని షెడ్యూలు కుటుంబ జీవితానికి దూరం చేస్తోంది. అయితే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా గెలవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. గొప్ప కోచ్‌గా వెనుదిరిగాలని ఆశిస్తున్నారు.


ప్రస్తుతం చాలా దేశాలకు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకరు, టెస్టు క్రికెట్‌కు మరొక కోచ్‌ ఉంటున్నారు. ఉదాహరణకు ఇంగ్లాండ్‌ టెస్టు టీమ్‌కు బ్రెండన్‌ మెక్‌ కలమ్‌ కోచ్‌. టీ20, వన్డే జట్లకు మాథ్యూ మోట్‌ ఉన్నారు. గతంలో ఆస్ట్రేలియా సైతం ఇదే మోడల్‌ను అనుసరించింది. బహుశా బీసీసీఐ సైతం ఇదే ట్రెండ్‌ ఫాలో అవుతుందని తెలిసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు ద్రవిడ్‌ను కోచ్‌గా ఉంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు జేషా మరొకరిని నియమించొచ్చు. ఆశీష్ నెహ్రా మంచి ఆప్షన్‌గా అనిపిస్తున్నా 2025 సీజన్‌ వరకు గుజరాత్‌ టైటాన్స్‌తో ఆయనకు ఒప్పందం ఉంది.


'ఒకవేళ టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ గెలిచినా రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకోవచ్చు. కాకపోతే ఆయన అత్యున్నత గౌరవంతో వెనుదిరుగుతారు. మీరు నన్ను అడిగితే వన్డే ప్రపంచకప్‌ తర్వాత బీసీసీఐ ఇద్దరు కోచ్‌లను నియమించొచ్చు. వాళ్లు ద్రవిడ్‌ను సుదీర్ఘ ఫార్మాట్‌ కోచ్‌గా కొనసాగాలని అడగొచ్చు' అని బీసీసీఐ మాజీ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఇప్పటికైతే అటు బోర్డు, ఇటు ద్రవిడ్‌ మెగా టోర్నీపైనే ఫోకస్‌ చేశారు.


పరిస్థితుల ప్రభావమో, దురదృష్టమో రాహుల్‌ ద్రవిడ్‌కు రావాల్సినంత పేరు ప్రతిష్ఠలు రాలేదు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం మ్యాచులోనే ఇంగ్లాండ్‌పై లండన్లో సెంచరీ కొట్టాడు. కానీ అదే మ్యాచులో సౌరవ్‌ గంగూలీ మరింత స్కోరు చేయడంతో అతడి నీడలోకి జారిపోయాడు. 2001 కోల్‌కతా టెస్టులో ఆస్ట్రేలియాపై 180 పరుగులు చేశాడు. కానీ వీవీఎస్‌ లక్ష్మణ్ 281తో అదరగొట్టడంతో మళ్లీ వెనక్కి పోయాడు. 2006-07లో టీమ్‌ఇండియా అతడి సారథ్యంలో రికార్డు స్థాయిలో వరుసగా 17 వన్డేల్లో లక్ష్యాలను ఛేదించింది. కానీ 2007లో గ్రెగ్‌ ఛాపెల్‌ ఉదంతంతో ఆ వన్డే ప్రపంచకప్‌లో ఘోరమైన ప్రదర్శన చేసింది. దాంతో వాల్‌ కెప్టెన్సీ వదిలేయాల్సి వచ్చింది.