ICC World Cup: రెండ్రోజుల క్రితమే వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఈ వెటరన్ స్పిన్నర్.. ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌లలోనూ చోటు కోల్పోవడంతో తనను తాను మరింత మెరుగుపరుచుకోవడానికి గాను కౌంటీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కౌంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ‘కెంట్’ తరఫున ఆడేందుకు చాహల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
చాహల్‌కు కౌంటీ క్రికెట్‌లో ఇదే తొలి సీజన్. ఇంతవరకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 51 ఇన్నింగ్స్‌లలో 87 వికెట్లు తీసిన చాహల్.. కౌంటీలలో ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. తన సొంత రాష్ట్రం హర్యానా తరఫున రంజీలు ఆడిన చాహల్ చివరిసారిగా 2022లో రంజీ ట్రోఫీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఈనెల 10 నుంచి మొదలుకాబోయే కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ 2023 టోర్నీలో చివరి మూడు మ్యాచ్‌లలో అతడు ఆడనున్నాడు. భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలు మ్యాచ్‌లు ఆడిన చాహల్ ఇంతవరకూ రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు.
చాహల్ ఎంట్రీపై కెంట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పాల్ డౌన్‌టౌన్ స్పందిస్తూ.. ‘చాహల్ మా టీమ్ తరఫున ఆడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్‌లో అతడు మాతో చివరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం మా జట్టు స్పిన్నర్లు మాథ్యూ పార్కిన్సన్, హమి ఖాద్రిలు అందుబాటులో లేకపోవడంతో ఆ లోటును చాహల్ భర్తీ చేస్తాడు. చాహల్ కూడా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఆడటానికి ఉత్సాహంగా ఉన్నాడు. చాహల్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాడు మా జట్టులోకి రావడం మా టీమ్‌కు మరింత బలాన్నిచ్చేదే’ అని చెప్పాడు.
ఎదురుచూస్తున్నా : చాహల్
కౌంటీలలో ఆడబోతుండటం తనకూ ఉత్సాహంగా ఉందంటున్నాడు చాహల్. కెంట్‌తో ఒప్పందం నేపథ్యంలో చాహల్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు కొత్త సవాల్ వంటిది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో పరిస్థితులకు తగ్గట్టు అలవాటుపడి రాణించడం అనేది కీలకం. ఆ సవాళ్లను స్వీకరించేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అని తెలిపాడు.
ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ టోర్నీలో కెంట్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. తర్వాత మూడు మ్యాచ్‌లలో కెంట్.. నాటింగ్‌హామ్‌షైర్, సోమర్‌సెట్, లంకాషైర్‌లతో తలపడాల్సి ఉంది.
ఇక వన్డే వరల్డ్ కప్‌లో చాహల్‌కు చోటుదక్కడంపై టీమిండియా మాజీలు సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ప్రపంచకప్ జట్టులో యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అతడు ప్యూర్ మ్యాచ్ విన్నర్’ అని రాసుకొచ్చాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial