Ind Vs Eng 4th T20 Live Updates: ఈ ఏడాది సొంతగడ్డపై తొలి టీ20 సిరీస్ ను భారత్ సాధించింది. శుక్రవారం పుణేలో జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లాండ్ పై 15 పరుగులతో విజయం సాధించింది. బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో మళ్లీ గెలుపుబాటలోకి భారత్ ఎక్కింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ సూపర్బ్ ఫిఫ్టీ (26 బంతుల్లో 51, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో జట్టును గెలిపించేందుకు విఫల పోరాటం చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ కు అన్ని కలిసి వచ్చాయి. ముఖ్యంగా చేసిన రెండు మార్పులు చాలా కలిసి వచ్చాయి. బ్యాటింగ్ లో రింకూ సింగ్, శివమ్ దూబే సత్తా చాటారు. అలాగే కంకషన్ కు గురై దూబే మైదానం వీడగా, అతని స్థానంలో వచ్చిన హర్షిత్ రాణా మూడు వికెట్లతో సత్తా చాటాడు. తాజా విజయంతో సిరీస్ ను 3-1తో భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ లో ఆఖరుదైన ఐదో టీ20 ముంబైలో ఫిబ్రవరి 2 (ఆదివారం) జరుగుతుంది. బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షిత్ లకు మూడేసి  వికెట్లు దక్కాయి. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లతో సత్తా చాటాడు. అర్షదీప్ ఒక వికెట్ తీసి టీ20ల్లో 99 వికెట్లతో నిలిచాడు. దూబేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

కంకషన్ తో హర్షిత్ డెబ్యూ..ఈ మ్యాచ్ లో తుదిజట్టులో లేని హర్షిత్ రాణాకు నిజంగా లక్కు కలిసొచ్చింది. బ్యాటింగ్ చేస్తుండగా బౌన్సర్ హెల్మెట్ కు బలంగా తాకడం కారణంగా శివమ్ దూబే గాయపడ్డాడు. దీనినే కంకషన్ అంటారు. గాయపడిన దూబే స్థానంలో మరో ఆటగాడిని తీసుకోడానికి ఐసీసీ రూల్స్ అనుమతిస్తాయి. దీంతో దూబే స్థానంలో తెలివిగా పేసర్ హర్షిత్ ను భారత్ తీసుకుంది. దీంతో ఈ మ్యాచ్ ద్వారా అనుకోకుండా హర్షిత్ డెబ్యూ చేశాడు. గతంలో కూడా ఒక మ్యాచ్ లో రవీంద్ర జడేజా కంకషన్ కు గురైతే యజ్వేంద్ర చాహల్ అతని స్థానంలో వచ్చి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎగరేసుకుపోయాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఛేజింగ్ లో ఇంగ్లాండ్ కు మెరుపు ఆరంభం దక్కింది. పవర్ ప్లేలో ప్రతి బౌలర్ ను ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ (19 బంతుల్లో 39, 7 ఫోర్లు, 1 సిక్సర్) ఊచకోత కోశాడు. దీంతో 5.5 ఓవర్లలోనే 62 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే చివరి బంతికి డకెట్ ను బిష్ణోయ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో నాలుగు బంతుల తేడాతో ఫిల్ సాల్ట్ (23), కెప్టెన్ జోస్ బట్లర్ (2) ఔటవడంతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది. ముఖ్యంగా డకెట్ ఆడుతున్నంతసేపు పదికిపైగా రన్ రేట్ తో పరుగులు సాధించింది. అతను ఔటవడంతో టీమిండియా మ్యాచ్ లోకి వచ్చింది. 

హడలగొట్టిన హరీ బ్రూక్..తొలి మూడు మ్యాచ్ ల్లో అంతగా ఫామ్ లో లేని హారీ బ్రూక్ ఈ మ్యాచ్ లో తనెంత ప్రమాదకర బ్యాటరో మరోసారి చాటి చెప్పాడు. దూకుడైన ఆటతీరుతో నిమిషాల్లో మ్యాచ్ ను ఇంగ్లాండ్ వైపు తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఐదు బౌండరీలు, రెండు కళ్లు చెదిరే సిక్సర్లతో భారత బౌలర్లపైకి ఎదురు దాడికి దిగాడు. ఈక్రమంలో 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తను ఉన్నంత సేపు మ్యాచ్ చేజారుతుందనే ఆందోళనను భారత అభిమానుల్లో కలిగించాడు. అయితే ఎట్టకేలకు అతడిని వరణ్ చక్రవర్తే మళ్లీ ఔట్ చేశాడు. ఫిఫ్టీ పూర్తయ్యాక స్కోరు వేగాన్నిపెంచేక్రమంలో స్లాగ్ షాట్ ఆడి అర్షదీప్ కు చిక్కాడు. తన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపలేక పోయారు. చివర్లో జామీ ఓవర్టన్ (15) మాత్రం కాస్త వేగంగా ఆడి, ఆందోళన పెంచినా, అతడిని హర్షిత్ పెవిలియన్ కు పంపాడు. దీంతో టార్గెట్ కు 15 పరుగుల దూరంలోనే ఇంగ్లాండ్ ఆగిపోయింది. సొంతగడ్డపై వరుసగా 17వ టీ20 సిరీస్ ను భారత్ గెలుపొందడం విశేషం. 

Read Also: Pune T20 Live Updates: భారత్ భారీ స్కోరు.. పాండ్యా, దూబే ఫిఫ్టీలు.. రాణించిన సాకిబ్, మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ సొంతం