అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌(International T20) చరిత్రలో అద్భుతం జరిగింది. ఒక టీ 20 మ్యాచ్‌  ఫలితం డబుల్‌ సూపర్‌ ఓవర్‌(Double Super Over) ద్వారా తేలింది. అఫ్గాన్‌(Afghanistan)తో జరుగుతున్న నామమాత్రమైన మూడో టీ 20లో భారత్‌-అఫ్గాన్‌లు కొదమ సింహాల్లా తలపడ్డాయి. ఇరుజట్లు ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించకపోవడంతో మ్యాచ్‌ చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. నామమాత్రపు మ్యాచ్‌ అయినా క్రికెట్‌ ప్రపంచాన్ని ఈ మ్యాచ్‌ ముని వేళ్లపై నిలబెట్టింది. భారత్‌ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్నా మ్యాచ్‌ మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో.. ఇరు జట్ల స్కోర్లు ఏకంగా రెండు సార్లు సమం కావడంతో మ్యాచ్‌ లో విజేతను డబుల్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా నిర్ణయించారు. అత్యంత ఉత్కంఠ మధ్య ముగిసిన రెండో సూపర్‌ ఓవర్‌లో భారత్‌ విజేతగా నిలిచి... మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. 

 

రోహిత్‌ సెంచరీ.. మ్యాచ్‌ టై

నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. తొలి రెండు మ్యాచుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన రోహిత్ శర్మ... మూడో మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. సూపర్ సెంచరీతో... టీ 20 ప్రపంచకప్ కు ముందు... ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. 22 పరుగులకే టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో  వున్నప్పుడు రోహిత్ విధ్వంసకర బాటింగ్‌తో అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు... 69 బంతుల్లో హిట్ మాన్ 11 ఫోర్లు.... 8 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు.  రోహిత్ కు అండగా నిలిచిన నయా ఫీనిషర్  రింకూ సింగ్ అర్ధ శతకంతో మరోసారి మెరిశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రింకూ 39 బంతుల్లో 69 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రింకూ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. రోహిత్, రింకూల విధ్వంసంతో టీమిండియా నిర్ణీత20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ గుర్బాజ్‌ 50, జర్దాన్ 50, గుల్బదీన్‌ నబీ 55, మహ్మద్‌ నబీ 34 పరుగులు చేయడంతో సరిగ్గా 212 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.

 

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా...

మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా అది కూడా టై అయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 16 పరుగులు చేయగా భారత్‌ కూడా 16 పరుగులే చేసింది. ఈ సూపర్‌ ఓవర్‌లో కూడా రోహిత్‌ శర్మ రెండు సిక్సులతో మ్యాచ్‌ టై కావడంతో కీలక పాత్ర పోషించాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో ఒక్క పరుగే రావడంతో ఈ మ్యాచ్‌ కూడా టై అయింది.

 

డబల్‌ సూపర్‌ ఓవర్‌

 తొలి సూపర్‌ ఓవర్‌ టై గా ముగియడంతో రెండో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఈ సూపర్‌ ఓవర్‌లో భారత్ తొలుత 11 పరుగులు చేసింది. మరో బంతి మిగిలి ఉండగానే రెండు వికెట్లు నేలకూలడంతో టీమిండియా 11 పరుగులకే పరిమితమైంది. ఇక అఫ్గాన్‌ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ స్పిన్నర్‌ రవిబిష్ణోయ్‌ అద్భుతమే చేశాడు. తొలి బంతికే వికెట్‌ తీసిన రవి బిష్ణోయ్‌... తర్వాతి బంతికి ఒక పరుగు ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికి మరోసారి వికెట్‌ తీయడంతో అఫ్గాన్‌ కథ ముగిసింది.  ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్‌ ఇంటిదారి పట్టింది . మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.