BGT LIve Updates: ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాటర్ల వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో కనీసం 200 మార్కును కూడా చేరలేకపోయింది. శుక్రవారం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న భారత్ 72.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాగా,  మిషెల్ స్టార్క్ కు మూడు, పాట్ కమిన్స్  రెండు వికెట్లు దక్కాయి. నాథన్ లయోన్ కు ఒక వికెట్  దక్కింది . భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ (98 బంతుల్లో 40, 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (2) ను బుమ్రా ఔట్ చేశాడు. భారత్ కంటే ప్రస్తుతం 176 పరుగుల వెనుకంజలో ఆసీస్ నిలిచింది.






వికెట్లు టపాటపా..
నిజానికి తొలిరోజు బౌలింగ్ కు కాస్త అనుకూలంగా ఉన్న ఈ పిచ్ పై భారత్ బ్యాటింగ్ కు దిగి పొరపాటు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. పిచ్ పై గడ్డి, తేమను ఉపయోగించుకుని ఆసీస్ బౌలర్లు చెలరేగి పోయారు. ముఖ్యంగా బోలాండ్ నాలుగు వికెట్లతో భారత నడ్డి విరిచాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగగా, వన్ డౌన్ బ్యాటర్ శుభమాన్ గిల్ (20) లంచ్ విరామానికి చివరి బంతికి ముందు ఔటయ్యాడు. నాథన్ లయన్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయి బోల్తా కొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (17) మళ్లీ ఆఫ్ స్టంప్ ఆవతలికి విసిరిన బంతికి స్లిప్పులో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో పంత్, రవీంద్ర జడేజా (26) జోడీ కాస్త వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఓపికగా బ్యాటింగ్ చేస్తూ నెమ్మదిగా ఒక్కోపరుగూ జోడిస్తూ ఆడారు. దీంతో ఐదో వికెట్ కు 48 పరుగులు జోడించారు. 


పాఠాలు నేర్వని పంత్..
నాలుగో టెస్టులో పుల్ షాట్ కు ప్రయత్నించి ఔటైన పంత్.. ఈ మ్యాచ్ లోనూ అదే విధంగా ఔటయ్యాడు. ఓపికగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన ఈ బ్యాటర్ బోలాండ్ బౌలింగ్ లో ఫుల్ షాట్ కు ప్రయత్నించి కమిన్స్ కు చిక్కాడు. పంత్ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ పేకమేడలా మరోసారి కూలిపోయింది. మెల్ బోర్న్ టెస్టు సెంచరీ హీరో, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఇలా వచ్చి అలా డకౌట్ గా వెనుదిరిగాడు. వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని పుష్ చేసి స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్ సుందర్ (14) కూడా ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ కు త్వరలోనే ఎండ్ కార్డు పడిపోయింది.


చివర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (22) కొన్ని విలువైన పరుగులు చేశాడు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ (3)తో కలిసి తొమ్మిదో వికెట్ కు 20 పరుగులు జోడించాడు.  ఆ తర్వాత సిరాజ్ (3 నాటౌట్) తో 17 పరుగులు జత చేశాడు. ఇక ఈ టెస్టులో భారత్ కు గెలుపు తప్పనిసరి. లేకపోతే పదేళ్ల తర్వాత బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)ని ఆసీస్ కు కోల్పోతుంది. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిఫ్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమిస్తుంది. ఇప్పటివరకు వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్.. రెండుసార్లు రన్నరప్ తోనే సంతృప్తి పడింది. ఈసారి చాంపియన్ గా నిలవాలని అభిమానులు కోరుకోగా, ఏకంగా ఫైనల్ రేసు నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. 
Also Read: 3rd Umpire Desicion On Kolhi: అదో చెత్త నిర్ణయం.. థర్డ్ అంపైర్ పై ఫైరయిన ఆసీస్ స్టార్