భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు అనుమతి పొందాడు. భారత జట్టుకు రాహులే నాయకత్వం వహించనున్నాడు. అతని డిప్యూటీగా శిఖర్ ధావన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. గతంలో శిఖర్ ధావన్ భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.


"BCCI వైద్య బృందం కేఎల్ రాహుల్‌ని అసెస్ చేసింది. జింబాబ్వేతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడేందుకు అతన్ని క్లియర్ చేసింది. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతనిని జట్టు కెప్టెన్‌గా నియమించింది. శిఖర్ ధావన్‌ని అతని డిప్యూటీగా నియమించింది." అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.


మే 25వ తేదీన కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్ 2022 ఎలిమినేటర్‌లో పాల్గొన్నప్పటి నుండి కేఎల్ రాహుల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. జూన్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే న్యూఢిల్లీలో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా కుడి గజ్జకు గాయం కావడంతో అతను సిరీస్‌కు దూరమయ్యాడు.


జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు కూడా దూరం అయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన భారత టీ20 సిరీస్ సమయంలో రాహుల్ తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కరోనా పాజిటివ్ రావడంతో దూరం కావాల్సి వచ్చింది.


భారత జట్టులోని రెగ్యులర్ వన్డే సభ్యులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. జింబాబ్వేతో ఆగస్టు 18వ తేదీన హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. జింబాబ్వేకు వికెట్ కీపర్-బ్యాటర్ రెగిస్ చకబ్వా నాయకత్వం వహించనున్నాడు. రెండో, మూడో వన్డేలు ఆగస్టు 20వ తేదీ, 22వ తేదీల్లో హరారే వేదికగా జరగనున్నాయి.


రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ హ్యామ్‌స్ట్రింగ్ టియర్‌తో బాధపడుతున్నందున అతను సిరీస్‌కు దూరమయ్యాడు. జింబాబ్వే కూడా బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా, వెల్లింగ్టన్ మసకద్జా లేకుండానే బరిలోకి దిగనుంది.


మూడు వన్డేలకు భారత జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్