హరారే వేదికగా జింబాబ్వే- భారత్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0తో గెలుచుకుంది. దీంతో మూడో వన్డేను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని రాహుల్ సేన చూస్తోంది.
జింబాబ్వేపై తొలి రెండు వన్డేల్లో పెద్దగా కష్టపడకుండానే గెలిచిన భారత్.. ఈ మ్యాచులో జట్టులో పలు మార్పులు చేసింది. రెండో వన్డేకు దూరమైన దీపక్ చాహర్ ను తీసుకున్నారు. సిరాజ్ స్థానంలో అవేశ్ ఖాన్ కు అవకాశం కల్పించారు.
మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడి, రెండో మ్యాచులో పర్వాలేదనిపించిన జింబాబ్వే ఈసారైనా గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఆ జట్టు పుంజుకుంటుందా అనేది అనుమానమే. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ ను కట్టడి చేయడం ఆ జట్టుకు సవాలే. బ్యాటింగ్ లో ఆ జట్టు చాలా మెరుగవ్వాల్సి ఉంది. మంచి ఆరంభం ఆ జట్టుకు అవసరం. 2020 నుంచి జింబాబ్వే సగటు ఓపెనింగ్ భాగస్వామ్యం 15 పరుగులు మాత్రమే. జోరు మీదున్న టీమిండియాకు కాస్తయినా పోటీ ఇవ్వాలంటే ఆ జట్టు బౌలర్లు పుంజుకోవాల్సిందే.
జట్లు
జింబాబ్వే
కైతానో, ఇన్నోసెంట్ కైయా, టోనీ మున్యాంగ, రెగిస్ చకబ్వా(కెప్టెన్), సికిందర్ రజా, సీన్ విలియమ్స్, రైన్ బర్ల్, లూక్ జాగ్వే, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ నైయుచి, రిచర్డ్ ఎన్ గరవ.
భారత్
శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్.