జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యం సంపాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 192 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (81 నాటౌట్: 113 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (82 నాటౌట్: 72 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. జింబాబ్వే టాపార్డర్‌ను కుప్పకూల్చిన దీపక్ చాహర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


అదరగొట్టిన భారత బౌలర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరు ఓవర్ల వరకు సాఫీగానే సాగింది. అనంతరం భారత పేస్ బౌలర్లు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన దీపక్ చాహర్ మూడు వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు.


ఓపెనర్లు ఇన్నోసెంట్ కయా (4: 20 బంతుల్లో), తదివనాషే మరుమని (8: 22 బంతుల్లో, ఒక ఫోర్), వెస్లీ మదెవెరెలను (5: 12 బంతుల్లో) దీపక్ చాహర్ వెనక్కి పంపాడు. మధ్యలో షాన్ విలియమ్స్‌ను (1: 3 బంతుల్లో) మహ్మద్ సిరాజ్, సికిందర్ రాజా (12: 17 బంతుల్లో, ఒక ఫోర్), ర్యాన్ బుర్ల్‌లను (11: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) ప్రసీద్ కృష్ణ అవుట్ చేశారు. కాసేపు పోరాడిన కెప్టెన్ రెగిస్ చకాబ్వా (35: 51 బంతుల్లో, నాలుగు ఫోర్లు), లూక్ జోంగ్వే (13: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుట్ అయ్యారు. దీంతో జింబాబ్వే 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


ఈ దశలో టెయిలెండర్లు బ్రాడ్ ఎవాన్స్ (33: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రిచర్డ్ ఎంగార్వా (34: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) జింబాబ్వేను ఆదుకున్నారు. వీరు తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించడం విశేషం. ఈ ద్వయం భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. ఎంగార్వా అవుటయ్యాక... 11వ నంబర్ బ్యాటర్ ఎన్యావుచి (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) కూడా వెంటనే అవుట్ కావడంతో జింబాబ్వే 189 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసీద్ కృష్ణ, అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు పడగొట్టారు. మహ్మద్ సిరాజ్‌కు ఒక్క వికెట్ దక్కింది.


మెల్లగా మొదలై విజృంభణ వైపు...
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎక్కడా తడబడలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (81 నాటౌట్: 113 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (82 నాటౌట్: 72 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్సర్) నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా తర్వాత వేగంగా ఆడారు. గిల్ బౌండరీతో విరుచుకుపడగా, శిఖర్ ధావన్ తనకు చక్కటి సహకారం అందించాడు.


జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చకాబ్వా ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్ చేయించినా ఫలితం రాలేదు. 20 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. పది వికెట్ల తేడాతో విజయం సాధించిన సందర్భాల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం.