టీమిండియాతో జరుగుతున్న మొదటి వన్డేలో జింబాబ్వే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు పది వికెట్లూ కోల్పోయింది. కెప్టెన్ రెగిస్ చకాబ్వా (35: 51 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... బ్రాడ్ ఎవాన్స్ (33: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రిచర్డ్ ఎంగార్వా (34: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా... టెయిలెండర్లు రాణించడం విశేషం.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరు ఓవర్ల వరకు సాఫీగానే సాగింది. ఆ తర్వాత భారత పేస్ బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన దీపక్ చాహర్ తన మూడు వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీయడం విశేషం.
ఓపెనర్లు ఇన్నోసెంట్ కయా (4: 20 బంతుల్లో), తదివనాషే మరుమని (8: 22 బంతుల్లో, ఒక ఫోర్), వెస్లీ మదెవెరెలను (5: 12 బంతుల్లో) దీపక్ చాహర్ పెవిలియన్‌కు పంపాడు. మధ్యలో షాన్ విలియమ్స్‌ను (1: 3 బంతుల్లో) మహ్మద్ సిరాజ్, ఆ తర్వాత సికిందర్ రాజా (12: 17 బంతుల్లో, ఒక ఫోర్), ర్యాన్ బుర్ల్‌లను (11: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) ప్రసీద్ కృష్ణ అవుట్ చేశారు. కాసేపు పోరాడిన కెప్టెన్ రెగిస్ చకాబ్వా, లూక్ జోంగ్వే (13: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుట్ అయ్యారు. దీంతో జింబాబ్వే 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో టెయిలెండర్లు బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ ఎంగార్వా జింబాబ్వేను ఆదుకున్నారు. వీరు తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 70 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్నారు. అయితే ఎంగార్వా అవుటయ్యాక... 11వ నంబర్ బ్యాటర్ ఎన్యావుచి (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) కూడా వెంటనే అవుట్ కావడంతో జింబాబ్వే 189 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసీద్ కృష్ణ, అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు తీసుకోగా.. మహ్మద్ సిరాజ్‌కు ఒక్క వికెట్ పడగొట్టాడు.