Chandrakanth Pandit named KKR's new head coach: రెండుసార్లు ఐపీఎల్ విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కోచ్‌ను నియమించుకుంది. దేశవాళీ క్రికెట్లో విజయవంతమైన చంద్రకాంత్ పండిత్‌ను తీసుకుంది. బ్రెండన్ మెక్‌కలమ్‌తో బంధం తెంచుకుంది. ఈ మేరకు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ట్వీట్ చేశారు.
దేశవాళీ క్రికెట్లో కోచ్‌గా చంద్రకాంత్ పండిత్‌కు మంచి పేరుంది. రంజీ టోర్నీలో చాలా జట్లను విజేతగా నిలిపిన అనుభవం ఆయన సొంతం. ఈ మధ్యే మధ్యప్రదేశ్‌ను ఆయన విజేతగా నిలిపారు.
'చందూ నైట్‌రైడర్స్ కుటుంబంలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రయాణంలో తర్వాతి దశను ఆయనే నడిపిస్తారు. ఆయన అంకితభావానికి తిరుగులేదు. దేశవాళీ క్రికెట్లో విజయవంతమైన ట్రాక్ రికార్డు ఉంది. మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో ఆయన భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాం' అని కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ ట్వీట్ చేశారు.
కేకేఆర్‌లో చేరుతున్నందుకు చంద్రకాంత్ పండిత్ ఆనందం వ్యక్తం చేశారు. 'ఈ బాధ్యతలు అప్పగించడం నాకెంతో గౌరవం. కేకేఆర్ కుటుంబ సంస్కృతి, విజయవంతమైన సంప్రదాయాల గురించి ఆటగాళ్ల ద్వారా ఇప్పటికే విన్నాను. జట్టులో నాణ్యమైన సహాయ సిబ్బంది, ఆటగాళ్లు ఉన్నారు. సానుకూల దృక్పథంతో నేనీ బాధ్యతలు నిర్వహిస్తాను' అని ఆయన అన్నారు.
చంద్రకాంత్ పండిత్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. టీమ్‌ఇండియా తరఫున 5 టెస్టులు, 36 వన్డేలు ఆడారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 48+ సగటుతో 8000 పైగా పరుగులు సాధించారు. కోచ్‌గా మధ్యప్రదేశ్‌కే కాకుండా ముంబయి, విదర్భ జట్లకు రంజీ ట్రోఫీలు అందించారు. 2018, 2019లో విదర్భను వరుసగా విజేతగా నిలిపారు.