Mohammed Siraj:  భారత్ - వెస్టిండీస్ మధ్య   నేటి   నుంచి మొదలుకాబోయే వన్డే సిరీస్‌కు ముందే టీమిండియా.. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చింది.  డొమినికా,  పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులలో ఆడిన   సిరాజ్.. భారత టెస్టు స్పెషలిస్టులతో పాటు స్వదేశానికి తిరిగివచ్చాడు.   వాస్తవానికి గతంలోనే   ప్రకటించిన  వన్డే జట్టులో సిరాజ్ పేరు కూడా ఉంది. అతడు వన్డేలు ఆడాల్సి ఉన్నా  టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం సిరాజ్‌కు విశ్రాంతినిచ్చింది. 


టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, కెఎస్ భరత్, నవదీప్ సైనీలతో పాటు సిరాజ్  కూడా స్వదేశానికి చేరుకున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో  సిరాజ్ పేస్ దళాన్ని నడిపిస్తాడని భావించినా అతడికి రెస్ట్ ఇవ్వడం గమనార్హం. 


వెస్టిండీస్‌తో  వన్డే, టీ20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత జట్టు.. ఆగస్టు-సెప్టెంబర్ లో ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు  అక్టోబర్ నుంచి వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది.  కీలక సిరీస్‌‌లు, టోర్నీలు ముందున్న నేపథ్యంలో వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సిరాజ్‌కు విశ్రాంతినిచ్చినట్టు టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. సిరాజ్‌కు విశ్రాంతినిచ్చినా అతడి స్థానంలో మరో ఆటగాడిని  రిప్లేస్ చేయలేదు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లలో  సిరాజ్ భారత జట్టులో కీలక బౌలర్. బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకోకుంటే భారత జట్టు షమీతో పాటు సిరాజ్ మీదే ఆధారపడాల్సి వస్తుంది.  అందుకే అతడికి రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 


 






టెస్టులతో పాటు వన్డేలలో కూడా  సిరాజ్ ప్రధాన బౌలర్‌గా మారాడు. ఈ ఏడాది  స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు  ఆస్ట్రేలియాతో  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా  సిరాజ్ మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.  పరిస్థితులకు తగ్గట్టుగా  ఆడుతున్న సిరాజ్ విండీస్‌తో సిరీస్‌లో లేకపోవడం భారత జట్టుకు లోటే అని చెప్పక తప్పదు.


సిరాజ్ గైర్హాజరీలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా..  పేస్ దళాన్ని నడిపించనున్నాడు. సిరాజ్ స్థానంలో  ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్‌లలో ఎవరికి తుది జట్టులో అవకాశం దక్కుతుందో మరి..  తొలి, రెండో వన్డే  జరిగి బార్బడోస్ పిచ్   బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కూ అనుకూలంగా ఉంటుంది. ఉమ్రాన్ మాలిక్ లేదా ముఖేష్ కుమార్‌లలో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కొచ్చని సమాచారం.  


వన్డే సిరీస్‌కు ఇరు జట్లు : 


వెస్టిండీస్ : షై హోప్ (కెప్టెన్),  రోమన్ పావెల్, అలిక్ అథనేజ్, యానిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రన్ హెట్‌మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోతీ,  జేడన్ సీల్స్, రొమారియా షెఫర్డ్, కెవిన్ సింక్లయర్, ఓషేన్ థామస్ 


భారత్ :   రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జయదేశ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial