వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ సమం చేసింది. నాలుగో టీ20లో తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారత్ 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 179 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో భారత్ సిరీస్‌ను 2-2తో విజయం సాధించింది.


భారత్ తరఫున యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (84 నాటౌట్: 51 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (77: 47 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) కూడా రాణించాడు. వెస్టిండీస్ తరఫున షిమ్రన్ హెట్‌మేయర్ (61: 39 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


ఓపెనర్ల విధ్వంసం
179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు టెర్రిఫిక్ స్టార్ట్ ఇచ్చారు. శుభ్‌మన్ గిల్ (77: 47 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (84 నాటౌట్: 51 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) జోరుగా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వెస్టిండీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో గిల్, జైస్వాల్ జోరు తగ్గకుండా ఆడారు. విజయానికి 14 పరుగుల ముంగిట రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో (7 నాటౌట్: 5 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి యశస్వి జైస్వాల్ మ్యాచ్‌ను ముగించాడు.


అదరగొట్టిన వెస్టిండీస్
టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కైల్ మేయర్స్ (17: 7 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ప్రారంభంలో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. కానీ రెండో ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్... కైల్ మేయర్స్‌ను అవుట్ చేసి భారత్‌కు మొదటి వికెట్ అందించాడు.అప్పటికి జట్టు స్కోరు 19 పరుగులు మాత్రమే.


వన్ డౌన్ బ్యాటర్ షాయ్ హోప్ (45: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (18: 16 బంతుల్లో, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బ్రాండన్ కింగ్‌ను అవుట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు రెండో వికెట్ అందించాడు. దీంతో పవర్‌ప్లేలోనే వెస్టిండీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.


ఫాంలో ఉన్న నికోలస్ పూరన్ (1: 3 బంతుల్లో), కెప్టెన్ రొవ్‌మన్ పావెల్‌లను (1: 3 బంతుల్లో) కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో అవుట్ చేసి వెస్టిండీస్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత షాయ్ హోప్, షిమ్రన్ హెట్‌మేయర్ (61: 39 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అర్థ సెంచరీకి కొంచెం ముంగిట బ్రాండన్ కింగ్ అవుట్ కావడంతో వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది.


రొమారియో షెపర్డ్ (9: 6 బంతుల్లో, ఒక సిక్సర్), జేసన్ హోల్డర్ (3: 4 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. అయితే షిమ్రన్ హెట్‌మేయర్, ఒడియన్ స్మిత్ వెస్టిండీస్‌ను భారీ స్కోరు వైపు నడిపించారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.