IND Vs WI, 3rd T20I: వెస్టిండీస్‌తో గయానా వేదికగా జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో భారత జట్టు టాస్ ఓడింది. వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్‌కు రానుంది. ఈ సిరీస్‌లో ఇదివరకే రెండు మ్యాచ్‌లను ఓడిన  టీమిండియా.. ఈ మ్యాచ్ లో కూడా ఓడితే సిరీస్ కోల్పోయే  ప్రమాదం ఉంది.  వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత జట్టు టీ20 సిరీస్‌ను  కూడా దక్కించుకోవాలంటే  నేడు  విండీస్‌తో జరిగే కీలక పోరులో తప్పక గెలవాల్సి ఉంది. గయానా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓడితే టీమిండియాకు  ఘోర అవమానంతో పాటు  రెండేండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న  రికార్డు కూడా చేజారిపోతుంది.  మరి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్ ఏం చేసేనో..? 


మూడో టీ2‌0లో టాస్  ఓడిన భారత జట్టులో పలు మార్పులు జరిగాయి. ఇషాంత్ కిషన్  స్థానంలో యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఇచ్చాడు. రవి బిష్ణోయ్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. ఇటీవలే టెస్టులలో అరంగేట్రం చేసిన జైస్వాల్‌.. టీ20లలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి మరి..! రెండు మ్యాచ్‌లను గెలిచి  సిరీస్ దక్కించుకోవాలన్న ఊపులో ఉన్న వెస్టిండీస్ టీమ్‌లో కూడా జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ ఛేజ్ బరిలోకి వచ్చాడు. 


గత రెండు మ్యాచ్‌లలో భారత టాపార్డర్ దారుణంగా విఫలమైంది.  ఓపెనర్లు శుభ్‌మన్ గిల్,  ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లు  దారుణంగా విఫలమయ్యారు. తిలక్ వర్మ ఒక్కడే  మెరుగ్గా ఆడి భారత్ పరువు నిలిపాడు.  కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రాణిస్తున్నా బ్యాటింగ్‌లో మాత్రం తన మ్యాజిక్‌ను చూపడం లేదు.  టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యంతో  భారత జట్టు గత రెండు మ్యాచ్‌లలో 150 పరుగులు కూడా చేయలేకపోయింది. 


ఇక బౌలింగ్ విషయానికొస్తే  కాస్తో కూస్తో ఫర్వాలేదనిపిస్తున్న ఈ విభాగంలో  కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వ్యూహాలు భారత్‌కు కొత్త తలనొప్పులను తెస్తున్నాయి.   వికెట్లు తీస్తున్న చాహల్ వంటి బౌలర్లను సరిగా వినియోగించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మరి నేటి మ్యాచ్‌లో అయినా   హార్ధిక్ అండ్ కో.  తిరిగి గాడినపడుతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు  వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ విభాగంలో కొన్ని లోపాలున్నా నేటి మ్యాచ్‌లో కూడా విజయం సాధించి  సిరీస్‌ను దక్కించుకోవాలని భావిస్తున్నది.  ఆ జట్టులో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 


టీ20లలో నెంబర్ వన్ టీమ్‌గా ఉన్న  టీమిండియా.. గడిచిన రెండేండ్లలో ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా ఓడిపోలేదు.  వరుసగా 11 సిరీస్ (స్వదేశం, విదేశాల్లో)  గెలిచిన భారత జట్టు.. నేటి మ్యాచ్‌లో ఓడితే ఈ  జైత్రయాత్రకు చెక్ పడ్డట్టే. ఇక విండీస్ అయితే  భారత్‌పై టీ20 సిరీస్ గెలవక ఆరేండ్లు అయింది. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే  ఆరేండ్ల తర్వాత సిరీస్ గెలిచినట్టు అవుతుంది.


 






తుది జట్లు : 


ఇండియా :  శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్,  యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్  


వెస్టిండీస్ :  కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, షిమ్రన్ హెట్‌మెయర్, రొవ్మన్ పావెల్ (కెప్టెన్),రోస్టన్ ఛేజ్, రొమారియా షెపర్డ్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్ 


























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial