IND Vs WI, Innings Highlights: భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్  మరోసారి బ్యాటింగ్‌తో తడబడింది.  తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు సమిష్టిగా రాణించి  విండీస్‌ను 159 పరుగులకే కట్టడి చేశారు. గయానా వేదికగా  జరుగుతున్న మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్..  నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు..  5 వికెట్ల నష్టానికి 159  పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (42 బంతుల్లో 42, 5 ఫోర్లు, 1 సిక్స్),  కెప్టెన్ రొవ్మన్ పావెల్ (19 బంతుల్లో 40 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) లు రాణించారు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. మరి ఈ మ్యాచ్‌లో అయినా భారత  బ్యాటర్లు  లక్ష్యాన్ని ఛేదిస్తారా..? అన్నది కొద్దిసేపట్లోనే తేలనుంది. 


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్‌కు  ఓపెనర్లు కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్ శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు  7.4 ఓవర్లలోనే 55 పరుగులు జోడించారు. తొలి రెండు ఓవర్లు మినహా   ఆరంభంలో స్పిన్నర్లతో ఎక్కువ ఓవర్లు వేయించాడు.  అక్షర్ పటేల్ వేసిన  ఎనిమిదో ఓవర్ నాలుగో బంతికి  మేయర్స్.. అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత  వచ్చిన ఛార్లెస్ (12)ను కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 


75 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో  క్రీజులోకి వచ్చిన  నికోలస్ పూరన్ (12 బంతుల్లో 20,  2 ఫోర్లు, 1 సిక్స్)  ధాటిగా ఆడాడు. బ్రాండన్ కింగ్‌తో  కలిసి నాలుగో వికెట్‌కు 30 పరుగులు  జోడించారు.  క్రమంగా పుంజుకుంటున్న ఈ జోడీకి కుల్దీప్ యాదవ్ షాకిచ్చాడు.  ఒకే ఓవర్లో   కుల్దీప్.. విండీస్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. అతడు వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి  పూరన్..  ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. ఇదే ఓవర్లో  ఐదో బంతికి  కింగ్.. కుల్దీప్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 


 






ఆఖర్లో  ఆదుకున్న కెప్టెన్..


కింగ్, పూరన్‌లు ఔట్ అవడంతో  క్రీజులోకి వచ్చిన  షిమ్రన్ హెట్‌మెయర్ (9) మరోసారి విఫలమయ్యాడు.  17వ ఓవర్లో బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్.. తొలి బంతికే  హెట్‌మెయర్‌ను ఔట్ చేశాడు. కానీ  కెప్టెన్ రొవ్మన్ పావెల్ మాత్రం భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  అర్ష్‌దీప్ వేసిన  18వ ఓవర్ల రెండు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో మొత్తంగా విండీస్ 17 పరుగులు పిండుకుంది.  ఇక ఆఖరి ఓవర్ వేసిన ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో.. 11 పరుగులొచ్చాయి. 


భారత బౌలర్లలో  కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్‌కు తలా ఓ వికెట్ దక్కింది. 



























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial