Rohit Sharma Record: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్‌లో రెండో మరియు చివరి మ్యాచ్ ట్రినిడాడ్‌లో జరుగుతోంది. మ్యాచ్ ఐదో రోజైన సోమవారం వర్షం కారణంగా ఇప్పటి వరకు (వార్త రాసే సమయానికి) మ్యాచ్ ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో డేవిడ్ వార్నర్‌ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు.


ట్రినిడాడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 143 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 44 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు.


ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ 2,092 పరుగులు చేశాడు. ఈ విషయంలో డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో డేవిడ్ వార్నర్ 2,040 పరుగులు సాధించాడు. 


ట్రినిడాడ్ టెస్టులో ఐదో రోజు వర్షం కారణంగా ఇప్పటి వరకు ఆట ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా తొలి సెషన్‌ రద్దయింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 289 పరుగులు చేయాలి. ఒకవేళ వర్షం ఆగకపోతే ఈ మ్యాచ్ డ్రా అవుతుంది. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా భారతే దక్కించుకోనింది.


రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ 206 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు. అతను 11 ఫోర్లు కొట్టాడు. ఓపెనర్లు రోహిత్ 80 పరుగులు, యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేశారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కూడా అర్థ సెంచరీలు సాధించారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు మాత్రమే సాధించింది.