Zaheer Khan: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా  రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను  1-0తో గెలుచుకున్న భారత జట్టులో  పలువురు ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనలు చేసినా తాను మాత్రం టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కే ఇచ్చేవాడినని  దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు.  రెండో టెస్టులో భాగంగా ఐదో రోజు ఆట వర్షార్పణమై  పేలవమైన డ్రా గా ముగిసిన తర్వాత జహీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 


జియో సినిమాలో జరిగిన చర్చలో భాగంగా జహీర్ ఖాన్ మాట్లాడుతూ... ‘తొలి టెస్టులో అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు. డొమినికాలో భారత విజయంలో అతడిదే కీలక పాత్ర.  మొత్తంగా ఈ సిరీస్‌లో అశ్విన్ 15 వికెట్లు పడగొట్టాడు.  రెండో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. ఈ సిరీస్‌ను అద్భుతంగా ముగించాడు.  అశ్విన్‌తో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా  మెరుగైన  ప్రదర్శనలు చేశారు. కానీ  డొమినికాలో భారత్‌కు విజయం అందించిన అశ్విన్‌కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కాలి.  నేనైతే అశ్విన్‌కే ఆ అవార్డ్ అందజేస్తా..’ అని  చెప్పాడు. 


డొమినికా టెస్టులో అశ్విన్.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడమే గాక రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.  రెండో టెస్టులో  మూడు  కీలక వికెట్లు తీయడమే గాక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (56) కూడా సాధించాడు. 


 






అసలు అవార్డే ఇవ్వలేదు.. 


జహీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు  అశ్విన్‌ను ప్రిఫర్ చేయగా.. అసలు  విండీస్ క్రికెట్ బోర్డు, బ్రాడ్‌కాస్టర్లు ఈ టెస్టు ముగిసిన తర్వాత అసలు ఆ అవార్డే ఇవ్వలేదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వలేదు.


 






డొమినికాలో మూడు రోజుల్లోనే విజయం సాధించిన భారత్.. రెండో టెస్టు కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావించింది. ఈ  క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి  ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ చివరిరోజు వర్షం ఎంతకూ విడవకపోవడంతో  ఈ టెస్టు పేలవమైన డ్రా గా ముగిసింది.  


 


































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial