Ashes Series 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య మాంచెస్టర్ వేదికగా  డ్రా గా ముగిసిన నాలుగో టెస్టు తర్వాత ఇప్పుడు అందరిచూపులూ  ‘కెన్నింగ్టన్ ఓవల్’మీదే పడ్డాయి.   ఓవల్ వేదికగా ఈనెల 27 నుంచి ఇక్కడ ఇంగ్లాండ్ - ఆసీస్‌లు యాషెస్ - 2023లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు ఆడనున్నాయి. ఈ టెస్టులో అయినా ఆసీస్.. మాంచెస్టర్‌తో చేసిన తప్పులను రిపీట్ చేయొద్దని, ఇద్దరు ఆల్ రౌండర్ల ప్రయోగాన్ని వీడి టీమ్‌లో ఒక స్పిన్నర్‌ను చేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా ఆసీస్ దిగ్గజం టామ్ మూడీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  


ఓవల్ టెస్టుకు ముందు  మూడీ మాట్లాడుతూ... ‘మాంచెస్టర్ టెస్టులో  ఆసీస్.. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీని ఆడించి ఉంటే బాగుండేది.  ఓవల్ టెస్టులో అయినా అతడిని ఆడించాలి.  బౌలింగ్ అటాక్‌లో కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి.   మర్ఫీ  అద్భుతమైన టాలెంట్ కలిగిన యువ స్పిన్నర్. అతడు నాథన్ లియాన్ కాకపోవచ్చు. కానీ లియాన్ కూడా షేన్ వార్న్ కాదు కదా.  మర్ఫీ తన  సొంత  బాటను వేసుకోవాలి.  ఆ మేరకు అతడు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు.  ఆ విషయంలో విజయం కూడా సాధించాడు..’అని కొనియాడాడు.  


22 ఏండ్ల మర్ఫీ.. ఈ ఏడాది బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన  టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేశాడు.  ఈ సిరీస్‌లో  అతడు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సీనియర్  స్పిన్నర్ లియాన్ కంటే  మర్ఫీ మెరుగ్గా రాణించాడు.  కాగా మాంచెస్టర్ టెస్టులో  ఆసీస్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగింది.  మిచెల్ స్టార్క్,  జోష్ హెజిల్‌వుడ్,  పాట్ కమిన్స్ తో పాటు మీడియం పేసర్లుగా కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్‌లు ఆడారు. ఈ ఐదుగురు మాంచెస్టర్ టెస్టులో ధారాళంగా పరుగులిచ్చారు. తుది జట్టులో ఒక స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం దశాబ్దకాలం తర్వాత ఇదే ప్రథమం. 


కాగా ఐదో టెస్టు జరుగబోయే ఓవల్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి. కొద్దిరోజుల క్రితమే  ఆసీస్.. ఇక్కడ భారత్‌తో వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడింది.  ఈ మ్యాచ్‌లో కూడా  ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ భారత బ్యాటర్ల పనిపట్టాడు. లియన్ గాయంతో తప్పుకోవడంతో టీమ్‌లోకి వచ్చిన మర్ఫీని ఓవల్ లో ఆడించాలని మూడీ అంటున్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా అతడిని  ఓవల్‌లో ఆడించకుంటే అది ఆశ్చర్యమే అని చెప్పాడు. 


‘మర్ఫీని ఓవల్‌లో ఆడించకుంటే అది చాలా ఆశ్చర్యకరమే అవుతుంది.  మాంచెస్టర్ టెస్టులో   ప్రధాన స్పిన్నర్ లేక ఆసీస్.. ట్రావిస్ హెడ్‌తో ఏడు ఓవర్లు వేయించింది. కానీ అతడు సక్సెస్ కాలేకపోయాడు. ఈసారి బౌలింగ్‌లో బ్యాలెన్స్ ఉండాలి.  టీమ్ బెటర్ కాంబినేషన్ దృష్ట్యా  పాట్ కమిన్స్ (ఆసీస్ సారథి)   కామెరూన్ గ్రీన్‌ను పక్కనబెట్టి మర్ఫీని ఆడించాలి. గ్రీన్‌ను పక్కనబెట్టమంటున్నానంటే అతడు నాణ్యమైన ఆటగాడు కాదని నా అర్థం. టీమ్ కాంబినేషన్ కోసం ఎవరో ఒకరు వాళ్ల ప్లేస్‌ను త్యాగం చేయాలి.  ప్రస్తుత పరిస్థితుల్లో మార్ష్‌ను పక్కనబెట్టడం కంటే గ్రీన్‌ను  ఆడించకుంటేనే బెటర్’అని  తెలిపాడు. 






























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial