న్యూఢిల్లీ: శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా తొలి టెస్ట్ సిరీస్ నెగ్గింది. ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత, పర్యాటక జట్టు విండీస్‌ను ఫాలో-ఆన్‌ ఆడించింది. తొలి టెస్టులో ఎదురైన సీన్ దాదాపు రిపీట్ అయింది. 

Continues below advertisement


అయితే, వెస్టిండీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో తమ పోరాటాన్ని చూపారు. ఈసారి చాలా ధైర్యంగా, నిలకడగా భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు అమోఘం. అయితే భారత్ ఛేదించడానికి 121 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇచ్చింది విండీస్ జట్టు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినా, భారత్ సునాయాసంగా విజయం సాధించింది.


రాణించిన రాహుల్


కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. కీలక సమయాల్లో నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ (100 పరుగులు) సాధించాడు. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన స్కోర్‌ను ఛేజింగ్ చేసే క్రమంలో హాఫ్ సెంచరీ చేశాడు. 58 పరుగులతో మ్యాచ్ ముగించాడు. నిన్న మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దాడు. తాజా ఇన్నింగ్స్ తో టెస్ట్ ఫార్మాట్‌లో రాహుల్ ఖాతాలో 20 అర్ధ సెంచరీలు, 11 సెంచరీలు ఉన్నాయి. 


సాయి సుదర్శన్ 76 బంతుల్లో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనూ 87 పరుగులతో రాణించాడు. ఫీల్డింగ్ లోనూ మెరిశాడు. మొదటి టెస్ట్‌లో 50 పరుగులు, ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 129 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కేవలం 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ విజయానికి కావాల్సిన పరుగులు చేశారు.



IND vs WI టెస్ట్ సిరీస్ గణాంకాలు


విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఎపెనర్ యశస్వి జైస్వాల్ 219 పరుగులతో సిరీస్‌ను టాప్ స్కోరర్‌గా ముగించాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను చేసిన 175 పరుగులు సిరీస్ లో అత్యుత్తమ స్కోరు. జైస్వాల్ తర్వాత కేఎల్ రాహుల్ (196 పరుగులు), శుభ్‌మన్ గిల్ (192) ఉన్నారు. వికెట్లలోనూ భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 12 వికెట్లతో అగ్ర స్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో ఉన్న మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వరుసగా 10, 8 వికెట్లు తీశారు.


 భారత్ తొలి ఇన్నింగ్స్‌ 518/5 వద్ద డిక్లేర్ 
జైస్వాల్ (175), శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్), ధ్రువ్ జురెల్ (44), నితీశ్‌ రెడ్డి (43) రాణించారు. 
కుల్‌దీప్ యాదవ్ (5/82), జడేజా (3/46)
భారత్ రెండో ఇన్నింగ్స్ 124/3


వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : 248 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్‌: 390 ఆలౌట్
కాంప్‌బెల్ (115), షై హోప్ (103), జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32)