వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా చాలా వేగంగా ఆడుతోంది. లంచ్ సమయానికి భారత్ 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్ నుంచే భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (52 బ్యాటింగ్: 56 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (63 బ్యాటింగ్: 102 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) వెస్టిండీస్ బౌలర్లపై సాధికారికంగా ఆడారు. మొదటి 10 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది.


అనంతరం భారత ఓపెనర్లు గేర్లు మార్చారు. 11 నుంచి 20 ఓవర్ల మధ్యలో ఏకంగా 58 పరుగులు సాధించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అర్థ సెంచరీ కూడా పూర్తయింది. 73 బంతుల్లోనే రోహిత్ శర్మ అర్థ సెంచరీ సాధించాడు. కీమర్ రోచ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


ఆ తర్వాత ఈ జోడి 100 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేసుకుంది. వీరికి వరుసగా ఇది రెండో సెంచరీ భాగస్వామ్యం. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కూడా వీరు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ 23వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే యశస్వి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి సెషన్ పూర్తయ్యే సరికి భారత్ 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు సాధించింది.


భారత్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్


వెస్టిండీస్ తుది జట్టు
క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తేజ్‌నరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్