Ashes Series, Innings Highlights: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ దూకుడుమీదుంది.  ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకే నిలువరించిన  ఇంగ్లాండ్.. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి  లంచ్ సమయానికల్లా 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి  61 పరుగులు చేసింది.  


స్టార్క్ పోరాడినా.. 


ఓవర్ నైట్ స్కోరు  299 పరుగుల వద్ద  రెండో రోజు ఆట ఆరంభించిన   ఆస్ట్రేలియాకు తొలి బంతికే షాక్ తగిలింది.   ఎదుర్కున్న తొలి బంతికే  ఆసీస్ సారథి పాట్ కమిన్స్..  జేమ్స్ ఆండర్సన్‌క  బౌలింగ్‌లో ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.  ఆ తర్వాత మిచెల్ స్టార్క్ (93 బంతుల్లో 36, 6 ఫోర్లు)   ఇంగ్లాండ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు.  అయితే  అవతలి ఎండ్‌లో జోష్ హెజిల్‌వుడ్ (21 బంతుల్లో 4) మాత్రం  తడబడ్డాడు.  క్రిస్ వోక్స్ వేసిన 91వ ఓవర్లో  రెండో బంతికి  హెజిల్‌వుడ్.. బెన్ డకెట్‌కు క్యాచ్ ఇచ్చాడు. వోక్స్‌కు ఇది  ఈ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్ కావడం గమనార్హం.


 






ఇంగ్లాండ్ ధాటిగా.. 


ఆసీస్‌ను 317 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులోకి  వచ్చీరాగానే వికెట్ కోల్పోయింది.  ఒక్క పరుగే చేసిన బెన్ డకెట్ (1)ను  స్టార్క్ ఔట్ చేశాడు. స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో తొలి బంతికే  డకెట్.. వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  కానీ  మరో ఓపెనర్ జాక్ క్రాలే (46 బంతుల్లో 26 నాటౌట్, 3 ఫోర్లు), మోయిన్ అలీ  (44 బంతుల్లో 31 నాటౌట్, 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా అడ్డుకోవడమే గాక ధాటిగా    ఆడుతున్నారు. 


కాగా నిన్న మొదలైన  ఈ టెస్టులో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనతను అందుకున్నాడు.  బ్రాడ్‌కు ఇది టెస్టులలో 600వ వికెట్ కావడం గమనార్హం.  టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన  ఐదో బౌలర్ బ్రాడ్. ఇంగ్లాండ్ తరఫున  అతడు జేమ్స్ ఆండర్సన్ తర్వాత  రెండో స్థానంలో నిలిచాడు. 


 






టెస్టులలో అత్యధిక వికెట్లు తీసినవారిలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (133 టెస్టులలో 800 వికెట్లు) అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ (145 టెస్టులలో 708 వికెట్లు),  ఇంగ్లాండ్‌కే చెందిన పేసర్ జేమ్స్  ఆండర్సన్ (182 టెస్టులలో 688 వికెట్లు) ఉండగా నాలుగో స్థానంలో భారత  లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (132 టెస్టులలో 619 వికెట్లు) నిలిచాడు.   బ్రాడ్ ఐదో స్థానంలో 166 టెస్టులలో 601 వికెట్లు తీసి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 

















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial