భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు 311 నష్టపోయి పరుగులు చేసింది. ఓపెనర్ షాయ్ హోప్ (115: 135 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు) సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు మూడు వికెట్లు దక్కాయి. భారత్ విజయానికి 50 ఓవర్లలో 312 పరుగులు కావాలి. కెరీర్ వందో వన్డేలో షాయ్ హోప్ సాధించడం విశేషం.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు కైల్ మేయర్, షాయ్ హోప్ మొదటి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. ఓపెనర్ కైల్ మేయర్స్ వేగంగా ఆడాడు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో దీపక్ హుడా వెస్టిండీస్‌ను దెబ్బ తీశాడు.
ఆ తర్వాత షామర్హ్ బ్రూక్స్, హోప్‌లు రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే షామర్హ్ బ్రూక్స్, బ్రాండన్ కింగ్‌లు వరుస ఓవర్లలో అవుటయ్యారు. దీంతో వెస్టిండీస్ 130 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నికోలస్ పూరన్, హోప్ వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. వీరు నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించారు.
చివర్లో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను దెబ్బ తీశాడు. చివర్లో వెస్టిండీస్ తరఫున వేగంగా పరుగులు చేసే వాళ్లు లేకపోవడంతో ఆఖర్లో తడబాటుకు లోనైంది. దీంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా... దీపక్ హుడా, అక్షర్ పటేల్, చాహల్ చెరో వికెట్ తీశారు.