IND vs WI 1st T20: భారత్, వెస్టిండీస్ ఐదు టీ20ల సిరీస్ మొదలైంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత పిచ్ నుంచి తమ బౌలర్లకు సహకారం అందొచ్చని పూరన్ అంటున్నాడు. అల్జారీ జోసెఫ్ అరంగేట్రం చేయబోతున్నాడని పేర్కొన్నాడు. షిమ్రన్ హెట్‌మైయిర్ సైతం జట్టులోకి వచ్చాడని వెల్లడించాడు. లారా స్టేడియంలో తొలి మ్యాచు ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని రోహిత్ శర్మ తెలిపాడు.
IND vs WI 1st T20 Playing Xi
భారత్: రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, భుశనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్షదీప్ సింగ్
వెస్టిండీస్: షమ్రా బ్రూక్స్, షిమ్రన్ హెట్‌మైయిర్, రోమన్ పావెల్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్, అకేల్ హుస్సేన్, ఓడీన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్, కీమో పాల్
సిరీస్‌పై కన్ను
ఇప్పటికే మూడు వన్డేల సిరీసును టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు టీ20 సిరీసూ గెలవాలని పట్టుదలగా ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంత సమయం లేదు కాబట్టి ఆటగాళ్లను బాగా పరీక్షించాలని భావిస్తోంది. అందుకే కుర్రాళ్లను ఎంపిక చేస్తోంది. వినూత్న వ్యూహాలు రచిస్తోంది. రిషభ్ పంత్‌ను ఓపెనింగ్‌కు దించుతుండటం ఇలాంటిదే.
స్లో పిచ్
బ్రయన్ లారా స్టేడియంలో ఇదే తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. గతంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ జరగడంతో పిచ్ స్వభావం గురించి అందరికీ తెలుసు. సాధారణంగా వికెట్ స్లోగా ఉంటుంది. తక్కువ స్కోర్లే నమోదు అవుతాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 141. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇక్కడ వర్షాలు పడతాయి. ఈ మ్యాచుకూ వరుణుడు అంతరాయం కలిగించొచ్చు.