IND vs AUS, CWG 2022: కామన్వెల్త్ క్రికెట్లో టీమ్‌ఇండియా ఆట మొదలు పెట్టింది. టీ20 ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న పోరులో భారత్ అదరగొట్టింది. ప్రత్యర్థికి 155 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. మొదట ఓపెనర్ షెఫాలీ వర్మ (48; 33 బంతుల్లో 9x4) బౌండరీతో హోరెత్తించగా చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52; 34 బంతుల్లో 8x4, 1x6) దుమ్మురేపింది. అద్భుత అర్ధశతకం బాదేసింది. స్మృతి మంధాన (24; 17 బంతుల్లో 5x4) ఫర్వాలేదనిపించింది. ఆసీస్‌లో జెస్ జొనాసన్ 4 వికెట్లు పడగొట్టింది.
ఆరంభంలో షెఫాలీ!
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ కాస్త మందకొడిగా ఉండటంతో టాస్ గెలిచిన హర్మన్ వెంటనే బ్యాటింగ్ ఎంచుకుంది. రావడం రావడమే ఓపెనర్ స్మృతి మంధాన దంచికొట్టడం షురూ చేసింది. దూకుడుగా ఆడుతున్న ఆమెను జట్టు స్కోరు 25 వద్ద బ్రౌన్ ఔట్ చేసింది. ఆ తర్వాత యస్తికా భాటియా (8) అండతో షెఫాలీ బౌండరీలు బాదేసింది. దాంతో 46 బంతుల్లోనే టీమ్‌ఇండియా స్కోరు 50 దాటేసింది.
ఆఖర్లో హర్మన్!
దూకుడు పెంచి హాఫ్ సెంచరీకి చేరువైన షెఫాలీని కీలక సమయంలో జొనాసెన్ పెవిలియన్ పంపించింది. అప్పుడు టీమ్‌ఇండియా స్కోరు 93. ఒకవైపు జెమీమా (11), దీప్తి శర్మ (1), హర్లీన్ డియోల్ (7) త్వరగా ఔటైనా కెప్టెన్ హర్మన్ మరోవైపు గట్టిగా నిలబడింది. మొదట్లో సింగిల్స్ తీస్తూ నిలదొక్కుకుంది. ఆఖర్లో వరుస బౌండరీలు, సిక్సర్లు బాదేసి స్కోరును 150 దాటించింది. చివరి ఓవర్లో ఆమెను మెగాన్ షూట్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ 154/8కి పరిమితమైంది.